తెలంగాణ ఎన్నికల్లో పవన్ మద్దతు ఈయన ఒక్కడికే

Thu Dec 06 2018 13:54:04 GMT+0530 (IST)

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని కొద్దిరోజుల క్రితం పేర్కొన్న పవన్.. తాజాగా ఓ వీడియో సందేశాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియో సందేశంలో  ముందస్తు ఎన్నికల వల్ల సమయాభావం కారణంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ఇచ్చామని రాష్ట్రాన్ని తెచ్చామని తెలంగాణను పెంచామనే వాళ్లు ప్రస్తుత ఎన్నికల్లో మన ముందున్నారని వారిలో ఎవరికి ఓటు వేయాలనే అయోమయం ప్రజల్లో ఉందన్నారు. అత్యంత ఎక్కువ పారదర్శకత అత్యంత తక్కువ అవినీతితో ఎవరైతే మెరుగైన పాలన ఇవ్వగలరని భావిస్తారో వారికే ఓటు వేయాలని దీనిపై ప్రజలంతా లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తద్వారా తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని అందివ్వాలని ఆయన కోరారు.అయితే పవన్ ప్రకటనపై జనసేన నేతలు ఒకరు ఆసక్తికర రీతిలో ట్విస్ట్ ఇచ్చారు. భద్రాచలం నియోజక వర్గంలో సీపీఐ(ఎం) అభ్యర్థి మిడియం బాబురావుకే జనసేన పార్టీ మద్దతు ఉంటుందని జనసేన నాయకులు దొంతు మంగే శ్వరరావు - అల్లాడ రమేష్ - జి.రవికుమార్ - బొడ్డు ఆనంద్ - అల్లాడి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఇందుకు వారు ఏ కారణం పేర్కొన్నారంటే - అత్యంత పారదర్శకత - నీతివంతులు - నిజాయితీపరులను ఎన్నుకోవాలని పవన్ పిలుపునిచ్చారని ఆ మేరకు భద్రాచలంలో మిడియం బాబురావు సరైన వ్యక్తి అనీ ఆయనకు జనపార్టీ మద్దతుగా ఉంటుందనీ తెలిపారు. నీతివంతుడిగా - నిజాయితీపరుడుగా - భద్రాచలం పార్లమెంటు సభ్యునిగా ఐదేండ్లు పనిచేసి ఎటువంటి మచ్చలేని నాయకుడిగా ఆయనకు పేరుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం ప్రకారం మిడియం బాబురావుకే ఓటు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు జరిగే ఓటింగ్లో జనసేన అభిమానులందరూ సీపీఎంకు ఓటేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసి కాంగ్రెస్ - బీజేపీ - కూటములకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. మరి ఈ ప్రకటన పవన్ అనుమతి మేరకు వచ్చిందేనా లేక నాయకులే తమంత తాముగా విడుదల చేశారా? అనేది తేలాల్సి ఉంది.