చంద్రబాబయినా డోన్ట్ కేర్: జానారెడ్డి

Fri Nov 09 2018 21:43:36 GMT+0530 (IST)

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు కొలిక్కి రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. దీంతో శనివారం సాయంత్రానికి టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - పార్టీ తెలంగాణ ఇంచార్జి రామచంద్ర కుంతియాలు దుబాయి పర్యటనలో ఉన్నారని.. వారు రాగానే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని తెలిపారు. టీఆరెస్ ముందస్తు ఎన్నికల ఉద్దేశంతో ఉండి ప్లాను ప్రకారం జాబితా ప్రకటించుకుందని.. కానీ తాము హఠాత్తుగా ఎన్నికలు రావడంతో అభ్యర్థుల విషయంలో కసరత్తు చేసి జాబితా విడుదల చేయాల్సి వస్తోందని.. అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు.
   
మరోవైపు మహాకూటమిని చంద్రబాబు శాసిస్తున్నారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏమైనా చేస్తే చంద్రబాబును కూడా సహించబోమని జానా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణలో తమతో పాత్తు కావాలని చంద్రబాబే తమ వద్దకు వచ్చారు కానీ - తామేమీ చంద్రబాబును సంప్రదించలేదని ఆయన అన్నారు.
   
చంద్రబాబే తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని... అంతేకానీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును కూటమిలో చేరమని ఆహ్వానించలేదని జానారెడ్డి గుర్తు చేశారు. దిల్లీలో చంద్రబాబు చాంబర్ వద్ద జానారెడ్డి పడిగాపులు కాశారన్న ప్రచారాన్నీ ఆయన ఖండించారు.. తాను చంద్రబాబు చాంబర్‌కు వెళ్లినమాట నిజమేనని.. అయితే రాహుల్ గాంధీ ఇంటికి చంద్రబాబు తొలుత వచ్చాక తాము ఆ తరువాత చంద్రబాబు ఆఫీస్ కు వెళ్లామని జానా స్పష్టం చేశారు. అంతేకానీ తామేమీ అక్కడ పడిగాపులు కాయలేదన్నారు.
   
పొత్తులో కలిసి ఉన్నాం కాబట్టి చంద్రబాబుతో రాజకీయ చర్చలు జరిపామని.. అందులో తప్పేముందని జానా ప్రశ్నించారు. చంద్రబాబు కూడా జాతీయస్థాయిలో అవసరాలను గుర్తించి తమతో కలిసి వచ్చేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు.
TAGS: