Begin typing your search above and press return to search.

కుమారుడి కోసం జానా పాట్లు

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:46 AM GMT
కుమారుడి కోసం జానా పాట్లు
X
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వారసత్వ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలనే రీతిలో తన పేరు, పరపతి ఉపయోగించి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రెండు టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తన రాజకీయ వారసుడు - కుమారుడు రఘువీర్ కోసం ఏకంగా ఢిల్లీ వెళ్లి జానారెడ్డి లాబీయింగ్ చేస్తుండడం విశేషం.

గడిచిన ఎన్నికల్లో జానారెడ్డి నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఈ నియోజకవర్గం పక్కనున్న మిర్యాల గూడలో తన అనుంగ శిష్యుడు ఎన్. భాస్కర్ రావుకు టికెట్ ఇప్పించి గెలిపించారు. జానారెడ్డికి నాగార్జున సాగర్ తో పాటు చుట్టుపక్కల రెండు - మూడు నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. దీంతో ఇక్కడ ఆయన గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.

కానీ కాంగ్రెస్ నుంచి గెలిసిన భాస్కర్ రావు ఆ తర్వాత పరిణామాల్లో గులాబీ పార్టీకి ఆకర్షితులై కారెక్కేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు మిర్యాల గూడలో అభ్యర్థి కరువయ్యాడు. తనకు బాగా బలమున్న ఈ నియోజకవర్గం నుంచి ఈసారి తన కుమారుడు రఘువీర్ ను పోటీకి దింపి గెలిపించాలని జానారెడ్డి యోచిస్తున్నారు. ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ మొదలు పెట్టారట.. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతో జానారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమై కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని.. తన ఫ్యామిలీకి రెండు టికెట్లు ఇవ్వాలని కోరారట.. గడిచిన ఎన్నికల్లో మిర్యాల గూడలో తన శిష్యుడు భాస్కర్ రావును గెలిపించిన తీరును వివరించాడట.. మరి.. కాంగ్రెస్ అధిష్టానం జానారెడ్డి మాటలను వింటుందా.? వీరికి రెండు టికెట్లు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది.