Begin typing your search above and press return to search.

జానాకు తప్పని అరెస్ట్ షాకు

By:  Tupaki Desk   |   29 July 2016 9:27 AM GMT
జానాకు తప్పని అరెస్ట్ షాకు
X
రూలంటే రూలే అన్నట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర సర్కారు వ్యవహారం. మల్లన్నసాగర్ ప్రాజెక్టు రచ్చ నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టు కింద భూమి కోల్పోయే ప్రాంతాలకు వెళ్లే రాజకీయ నేతలు ఎవరైనా సరే అరెస్ట్ చేసేయటం తెలంగాణ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. తాజాగా ఇలాంటి అనుభవం తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డికి ఎదురైంది. జానారెడ్డిని తరచూ సీనియర్ నేతగా.. విశేష అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా పేర్కొంటూ అపారమైన ప్రేమాభిమానాలు పొంగిస్తూ.. గౌరవాన్ని కట్టబెడుతున్నట్లుగా తెలంగాణ అసెంబ్లీలో అధికారపక్ష సభ్యుల వైఖరి కనిపిస్తుంది.

ఎవరి వరకో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రులంతా కూడా ఆయన్ను కీర్తిస్తూనే విమర్శిస్తుంటారు. అయితే.. అధికారపక్ష పొగడ్తలకు.. తెగడ్తల మర్మాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇబ్బందికరంగా మారిన మల్లన్న సాగర్ ఇష్యూ మీద మరింత పట్టు బిగించేందుకు వీలుగా విపక్షాలు రంగంలోకి దిగటం.. భూములు కోల్పోయే గ్రామాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకోవటం.. వాటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సదరునేతల్ని అదుపులోకి తీసుకోవటం రివాజుగా మారింది. ఇప్పటికే ఈ ఇష్యూలో అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. మల్లన్నసాగర్ నిరాశ్రయ గ్రామాలకు ఏనేత వెళ్లకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు.

తాజాగా.. జానారెడ్డి.. తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్న షబ్బీర్ అలీ ఇద్దరూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్ని పరిశీలించేందుకు బయలుదేరారు. హైదరాబాద్ నుంచి వారి ప్రయాణం మొదలై.. నేషనల్ హైవే మీదకు వచ్చేసరికి వారి వాహనాల్ని పోలీసులు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి దగ్గర సిద్ధిపేట డీఎస్పీ జానారెడ్డి.. షబ్బీర్ అలీ వాహన శ్రేణిని నిలిపేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. జానారెడ్డి లాంటి సీనియర్ నేతలాంటి వారిని సైతం అడ్డుకోవటం ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే..జానారెడ్డి.. షబ్బీర్ అలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పకుండా పోలీస్ వ్యాన్ లలో తిప్పుతున్నారు. ఈ మధ్య కాలంలో నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఎక్కడికి తీసుకెళుతున్నారన్న విషయంపై ఏ మాత్రం స్పందించకుండా అదే పనిగా తిప్పుతూ.. తిప్పుతూ తిరిగి ఎక్కడో ఒకచోట నిలిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి తీసుకెళుతున్న విషయాన్ని ముందే చెప్పేస్తే.. అక్కడికి నేతల్ని.. కార్యకర్తల్ని జమ చేసి మరింత హడావుడి చేస్తుండటంతో.. అందుకు విరుగుడుగా పోలీసులు ఇలాంటి ఐడియాతో నేతలకు తమదైన శైలిలో చుక్కలు చూపిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ నెల 26న కాంగ్రెస్ నేతలు ఛలో మల్లన్నసాగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీభవన్ దాటకుండానే నేతల్ని నిలువరించిన పోలీసులు.. తాజాగా మాత్రం జానారెడ్డిని నేషనల్ హైవే వరకూ ఓకే చేసి అదుపులోకి తీసుకోవటం గమనార్హం.