జమ్మూకశ్మీర్ సృష్టించిన రికార్డ్ ఇది

Tue Jun 19 2018 19:08:19 GMT+0530 (IST)

జమ్ముకశ్మీర్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పరిపాలన విషయంలో...తర్వాత ఏం జరగనుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. వివిధ వర్గాల అంచనా ప్రకారం గవర్నర్ పాలనే మార్గం. అయితే...ఆ రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లకుండా ఉండాలంటే అసెంబ్లీ మెజారిటీకి సరికొత్త సంకీర్ణం అవసరమౌతోంది. గవర్నర్ పాలనను తప్పించుకోవాలంటే పీడీపీ(పీపుల్స్ డెమోక్రటిక్ అలయెన్స్) - ఎన్ సీ(నేషనల్ కాంగ్రెస్) పొత్తే తక్షణ పరిష్కారమని పలువురు చెప్తున్నారు గతానుభవాల దృష్ట్యా మోహబూబా ముఫ్తీ - ఫరూక్ అబ్దుల్లా ఏ మేరకు కలిసి వెళ్తారనేది వేచి చూడాల్సిన అంశమే. గతంలో జమ్ముకశ్మీర్ ఏడుసార్లు రాష్ట్రపతి పాలనను ఎదుర్కొంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే ఇది ఎనిమిదవసారి అవనుంది. సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన క్రమంలో జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించిన వివరాలిలా ఉన్నాయి. ఎనిమిది సందర్భాల్లో గవర్నర్ పాలన విధించడం ఓ రికార్డ్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.- 26 మార్చి - 1977 నుంచి 9 జులై - 1977.. 105 రోజుల పాటు.. కాంగ్రెస్ పార్టీ తన మద్దతు ఉపసహరించుకోవడంతో షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.

- 6 మార్చి 1986 నుంచి 7 నవంబర్ - 1986.. 246 రోజులు.. శాసనసభలో బలనిరూపణలో విఫలమైన కారణంగా

- 19 జనవరి - 1990 నుంచి 9 అక్టోబర్ - 1996.. శాంతి భద్రతలు క్షీణించిన కారణంగా ఆరు సంవత్సరాల 264 రోజుల పాటు..

- 18 అక్టోబర్ - 2002 నుంచి 2 నవంబర్ - 2002.. రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో నిర్ణయం తీసుకోని కారణంగా 15 రోజుల పాటు

- 11 జులై - 2008 నుంచి 5 జనవరి - 2009.. 178 రోజుల పాటు.. అమర్ నాథ్ యాత్రికుల సౌకర్యార్థం భూ బదాలింపు విషయంలో సీఎం గులాం నబీ ఆజాద్ తీసుకున్న నిర్ణయంతో పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది.

9 జనవరి 2015 నుంచి 1 మార్చి - 2015.. 51 రోజుల పాటు.. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ - పీడీపీలు అవగాహనకు రావడంలో విఫలమైన కారణంగా గవర్నర్ పాలనను విధించారు.