Begin typing your search above and press return to search.

జైపాల్‌ కు ప్ర‌మోష‌నే!... డిమోష‌న్ కూడా!

By:  Tupaki Desk   |   10 Aug 2018 5:44 PM GMT
జైపాల్‌ కు ప్ర‌మోష‌నే!... డిమోష‌న్ కూడా!
X
మ‌న‌మంతా ఎస్ జైపాల్ రెడ్డిగా పిలుచుకునే సూదిని జైపాల్ రెడ్డి... తెలుగు నేల రాజ‌కీయాల‌తో పాటు జాతీయ రాజ‌కీయాల్లోనూ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే... కీల‌క శాఖ‌ల మంత్రిగా జైపాల్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. వైక‌ల్యంతో క‌నిపించే జైపాల్ రెడ్డి... వ్య‌వ‌హారంలో మాత్రం మ‌హా దిట్ట కిందే లెక్క‌. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించిన త‌ర్వాత జ‌రిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు జైపాల్ రెడ్డి పేరు మారుమోగింద‌నే చెప్పాలి. తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డితే... ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్ప‌డే ప్ర‌భుత్వానికి జైపాల్ రెడ్డే ర‌థ‌సార‌ధి అని, తెలంగాణ‌కు కాబోయే ముఖ్య‌మంత్రి ఆయ‌నేన‌ని బాగానే ప్ర‌చారం సాగింది. అయితే తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పార్టీకి కాకుండా... తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవత‌రించ‌డానికి దోహ‌ద‌ప‌డ్డ తెరాస‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఫ‌లితంగా టీఆర్ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర‌రావు తెలంగాణ‌కు తొలి సీఎం కాగా... జైపాల్ రెడ్డి మాత్రం సైలెంట్ అయిపోయారు.

అయినా ఇప్పుడు జైపాల్ రెడ్డి ప్ర‌స్తావ‌న ఎందుకంటారా? గ‌తం గ‌తః క‌దా. గ‌తంలో ప‌రాభ‌వం జ‌రిగింద‌ని రాజ‌కీయ నేత‌లు ఇంట్లోనే కూర్చోలేరు క‌దా. అలానే ఇప్పుడు జైపాల్ రెడ్డి కూడా మ‌రోమారు రంగంలోకి దిగారు. పార్టీ అధిష్ఠానం(ఏఐసీసీ)లో కీల‌క మార్పులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని, అత్యున్న‌త కార్య‌వ‌ర్గంలో చోటు ద‌క్కించుకుని తెలంగాణ రాజ‌కీయాల్లో పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యేందుకు ప‌క్కా ప్లాన్ వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్న‌త కార్య‌వ‌ర్గం ఏద‌న్న విష‌యానికి వ‌స్తే... మ‌న‌మంతా సీడ‌బ్ల్యూసీగా పిలుచుకునే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీనే. ఈ క‌మిటీలో స‌భ్యుడిగా చేరాల‌ని, త‌ద్వారా అటు జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును, తెలంగాణ‌లో పార్టీపై ప‌ట్టును సాధించ‌వ‌చ్చ‌న్న‌ది జైపాల్ రెడ్డి ప్లాన్‌గా వినిపించింది. సీనియారిటీని చూసినా జైపాల్ కోరిక‌లేమీ పెద్ద‌గా త‌ప్పుగా క‌నిపించే అవ‌కాశం కూడా లేద‌నే చెప్పాలి. అయితే జైపాల్ రెడ్డి విన‌తుల‌ను పార్టీ అధిష్ఠానం పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌నే చెప్పాలి. జైపాల్ కోరిన ప‌ద‌విని ప‌క్క‌న‌పెట్టేసి... త‌న దృష్ఠిలో ఆయ‌న‌కు ఏ పద‌వి అయితే స‌రిపోతుంద‌ని భావించిందో అదే ప‌దవిని క‌ట్ట‌బెట్టిన‌ట్టుగా ప్ర‌చారం సాగుతోంది.

అయినా జైపాల్ రెడ్డి కోరిందేమిటి?, ఆయ‌న‌కు కాంగ్రెస్ పార్టీ కేటాయించిన ప‌ద‌వి ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... సీడ‌బ్ల్యూసీలో స‌భ్య‌త్వం కావాల‌ని జైపాల్ రెడ్డి కోరారు. ఆ మేర‌కు త‌న‌వంతుగా ప్ర‌య‌త్నం కూడా చేశారు. అంతేకాకుండా త‌న అనుచ‌ర వ‌ర్గంతో జైపాల్ రెడ్డి బాగానే ప్ర‌చారం చేయించుకున్నారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ అథిష్ఠానం మాత్రం జైపాల్ రెడ్డికి సీడ‌బ్ల్యూసీ స‌భ్య‌త్వానికి బ‌దులుగా ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించింది. ఈ ప‌రిణామంపై భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. జైపాల్ రెడ్డి కోణం నుంచి చూస్తే... ఓ కేంద్ర మంత్రిగానే కాకుండా, వాగ్దాటి క‌లిగిన నేత‌గా మంచి పేరు సంపాదించుకున్న ఆయ‌న‌కు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి అంటే... డిమోష‌న్ కిందే లెక్క‌. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కోణంలో చూస్తే మాత్రం ఇంకో భావ‌న క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌లు కాంగ్రెస్ పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గానే చెప్పాలి. ఎన్నిక‌ల‌కు ఏడాది కూడా స‌మ‌యం లేని ప్ర‌స్తుత త‌రుణంలో మంచి వాగ్దాటి క‌లిగిన జైపాల్ రెడ్డి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో వైరి వ‌ర్గాల‌ను చీల్చి చెండాడే అవ‌కాశం ఉంది. అంటే.. నిన్న‌టిదాకా పార్టీ వాణిని వినిపించే అవ‌కాశం పెద్ద‌గా లేకున్నా... ఇప్పుడు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో జైపాల్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించినట్టుగానే చెప్పాలి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు సుదీర్ఘ కాలం పాటు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన దిగ్విజ‌య్ సింగ్... ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతే త‌న‌లోని వాక్ప‌టిమ‌ను చూపించిన వైనాన్ని ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్ర‌త్యేకంగా గుర్తు చేస్తున్నాయి. ఈ లెక్క‌న చూస్తే... జైపాల్ రెడ్డికి ప్ర‌మోష‌న్ ల‌భించిన‌ట్టుగానే చెప్పాలి.