Begin typing your search above and press return to search.

ఇందిరను హత్య చేస్తారని ముందే తెలుసట

By:  Tupaki Desk   |   23 July 2016 4:31 AM GMT
ఇందిరను హత్య చేస్తారని ముందే తెలుసట
X
మరో సంచనల విషయం బయటకు వచ్చింది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తారన్న విషయం ఒక వ్యక్తికి ముందే తెలుసని.. దాదాపు నెలల ముందే ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అతనికి ఉందన్న విషయాన్ని బ్రిటన్ డాక్యుమెంట్ ఒకటి స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన సదరు డాక్యుమెంట్ ప్రకారం ఇందిర హత్య గురించి తెలిసిన వ్యక్తి జగ్జీత్ సింగ్ చౌహాన్ గా చెబుతున్నారు. భారత్ నుంచి యూకేకు వలస వెళ్లిన ఇతగాడు.. ఖలిస్థాన్ కోసం అనేక ఆందోళనలు చేశాడు.

ఇతడికి ఇందిరాగాంధీ హత్య సమాచారం తెలుసన్న విషయం బయటకు వచ్చింది. ఖలిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడాలంటూ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన ప్రముఖుల్లో ఒకరు జగ్జీత్ సింగ్ చౌహాన్.

పంజాబ్ లో పుట్టి పెరిగిన ఇతను వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్ గా పని చేశారు. కొంతకాలం తర్వాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన ఆయన.. 1971లో లండన్ కు వెళ్లి.. అక్కడ సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్ అనే సంస్థను స్టార్ట్ చేశాడు. ఆ సంస్థ సాయంతో ఖలిస్థాన్ ఉద్యమాన్ని విస్తరించే ప్రయత్నంతో పాటు.. తమ వాదనలకు తగ్గట్లుగా అమెరికా.. కెనడాల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. 2001లో ఇండియాకు తిరిగి వచ్చి ఖల్సా రాజ్ పార్టీని ఏర్పాటు చేసిన అతనికి జనాదరణ పెద్దగా లేదు. 78 ఏళ్ల వయసులో అతడు 2007లో మరణించారు. తరచూ సంచలన వ్యాఖ్యలు చేయటంతో పాటు.. అతడి వ్యాఖ్యలు బ్రిటన్.. భారత్ ద్వైపాక్షిక సంబంధాల మీద ప్రభావం చూపేవిగా ఉండటం గమనార్హం. ఇందిరతో పాటు రాజీవ్ సైతం హత్యకు గురి అవుతారంటూ వ్యాఖ్యానించేవాడని సదరు డాక్యుమెంట్ వెల్లడించటం గమనార్హం.