Begin typing your search above and press return to search.

మన రాష్ట్రమని మనోళ్లతోనే కొట్టిస్తవ కేసీఆర్

By:  Tupaki Desk   |   26 July 2016 3:44 AM GMT
మన రాష్ట్రమని మనోళ్లతోనే కొట్టిస్తవ కేసీఆర్
X
ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పాలించటం అంత తేలికైన విషయం కాదు. అందులోకి ప్రజాచైతన్యం ఎక్కువగా ఉండే తెలంగాణరాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులకు చిన్న సందు కూడా ఇవ్వకుండా పాతిక నెలలు పాలించటం మామూలు విషయం కాదు. అత్తెసరు మార్కుల్లాంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద చాలామందికి చాలానే అపోహలు ఉండేవి. ఉద్యమాలకు అలవాటు పడిన ప్రాణం.. ప్రభుత్వ నిర్వహణ లాంటివి కేసీఆర్ కు సాధ్యమయ్యే పనులేనా? అన్న ప్రశ్నలు కూడా వినిపించాయి. అయితే.. తనలోని సత్తా ప్రదర్శించిన కేసీఆర్ దెబ్బకు విపక్షాల నోటి నుంచి మాట రాని పరిస్థితి.

అంతేకాదు.. తనదైన ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించి ఒక్కో పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన ఆయన.. ఇరవై నెలలు గడిచేసరికి తెలంగాణలో తిరుగులేని అధికారపక్షంగా అవతరించారు. అలాంటి ఆయన.. ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉండేది. ఇలాంటి వేళ తెర మీదకొచ్చిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో మొత్తం యవ్వారమే మారిపోయింది.

ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు ఖర్చు కావటంతో పాటు.. పెద్ద ఎత్తున ప్రజలు భూములు కోల్పోవటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి తోడు అన్ని విషయాల్లోనూ భరోసాను ప్రదర్శించే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమైందో కానీ.. మల్లన్నసాగర్ బాధితుల విషయంలో ఆయన వ్యవహరించిన వైఖరితో బాధితులు రోడ్లు ఎక్కే పరిస్థితి. తమకేమాత్రం అవకాశం ఇవ్వని కేసీఆర్ మీద పట్టు సాధించేందుకు ఒళ్లంత కళ్లేసుకొని చూస్తున్న విపక్షాలకు మల్లన్నసాగర్ వ్యవహారం పెద్ద ఆయుధంగా మారింది.

దీనికి తోడు.. ప్రజా సంఘాలతో పాటు.. ఆచితూచి వ్యవహరిస్తూ.. కూసింత తెలంగాణ అధికారపక్షం వైపే మొగ్గే కోదండం మాష్టారు సైతం ‘మల్లన్న’లో తప్పులున్నాయని తేల్చేయటం తెలంగాణ ప్రతిపక్షాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. పరిహారం విషయంలో పట్టుదలకు పోవటం.. నిర్వాసితులతో సరైన సమయంలో.. సరిగా డీల్ చేయాల్సింది పోయి బలప్రయోగాన్ని నమ్ముకోవటంతో ఆదివారం నాటి ఘటన చోటు చేసుకుంది. భూములు కోల్పోయే నిర్వాసితుల మీద పోలీసులు చెలరేగిపోవటం.. మహిళా పోలీసులు బాధితుల ఇళ్లల్లోకి పోయి మహిళల్ని బయటకు తీసుకొచ్చి మరీ లాఠీలతో కొట్టించిన వైనం అక్కడి వారికి మరింత మండిపోయేలా చేసింది.

తమకు జరుగుతున్న అన్యాయంపై రగిలిపోతున్న ప్రజలకు తగ్గట్లే నేతల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన పరివారం మీద నోరు తెరిచేందుకు సాహసించని వారు తాజాగా చెలరేగిపోవటమే కాదు.. ప్రజలకు ఎక్కడో తగిలేలా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల్నే తీసుకుంటే.. ‘‘మన రాష్ట్రం.. మన పాలన అంటూ పోలీసోళ్లతో ప్రజల్ని కొట్టిస్తర?’’ అంటూ ఆయన మంత్రి హరీశ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయకపోతే.. హరీశ్ ను జిల్లాలో అడుగు పెట్టనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చేశారు. ఎనిమిది గ్రామాల్లో ఆరు గ్రామాల ప్రజలు భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఒకవేళ అదే నిజమైతే.. భూములు కోల్పోయేవారు రోడ్ల మీదకు ఎందుకు వస్తారని? ఆందోళనలకు ఎందుకు దిగుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించటం అన్నది మొదలు కాకూడదు. ఒకసారి మొదలైతే అది అక్కడితో ఆగదన్న విషయం కేసీఆర్ లాంటి రాజకీయ దిగ్గజానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమను విమర్శించే వారికి కేసీఆర్ ఎందుకు అవకాశం ఇస్తున్నారన్నదే..?