పవన్ దెబ్బకు కేంద్రం కూడా కదిలింది

Tue Jan 10 2017 13:09:08 GMT+0530 (IST)

పవర్ స్టార్ - జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సత్తాకు ఇది మరో నిదర్శనం. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలోని కిడ్ని బాధితులను ఇటీవల పవన్ పర్యటనకు ముందు వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని సంగతి తెలిసిందే. అయితే పవన్ టూర్ తర్వాత సీన్ మారింది. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి పించన్లు - బస్ పాసులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇపుడు అదే రీతిలో కేంద్రం సైతం రంగంలోకి దిగింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితులు ఎక్కువుగా ఉన్నారని దీనికి సంబంధించి కారణాలను పరిశీలించడానికి కేంద్రం నుంచి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ ద్వారా ప్రత్యేక బృందాన్ని పరిశోధన నిమిత్తం పంపనున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రకటించారు.

విశాఖలో సిజిహెచ్ ఎస్ వెల్ నెస్ సెంటర్ ను కేంద్ర పట్టణ - గ్రామీణ అభివృద్ధిశాఖామంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి నడ్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానం బాధితుల విషయంలో సమస్య సుదీర్ఘకాలం ఉండటం బాధాకరమన్నారు. ఈ పరిస్థితికి ఇప్పటివరకు కారణం-పరిష్కారం దొరకననందున త్వరలోనే తమ సారథ్యంలోని ప్రత్యేక బృందాన్ని పంపించనున్నట్లు నడ్డా ప్రకటించారు. ప్రధానమంత్రి డయాలసిస్ యోజనను పీపీపీ మోడల్ లో ఏర్పాటు చేశామన్నారు. ఏపీకి ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ను మంజూరు చేస్తున్నామని నడ్డా ప్రకటించారు.  కాగా వెల్ నెస్ సెంటర్ గురించి నడ్డా వివరిస్తూ రూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు - పింఛన్ దారులంతా ఆధార్ కార్డు మాదిరిగా సిజిహెచ్ ఎస్ హెల్త్ కార్డులను శాశ్వతంగా ఉండే విధంగా ప్లాస్టిక్ కార్డును తయారు చేసి అందజేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చిన్నారులు - గర్భిణులు - బాలింతల ఆరోగ్య పరిరక్షణకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తోందని నడ్డా వివరించారు. దేశవ్యాప్తంగా ఆలిండియా మెడికల్ సైన్సెస్ లు (ఎయిమ్స్) 11 మంజూరయ్యాయని 20 రాష్ట్రాల్లో క్యాన్సర్ నిర్థారణ సంస్థలను రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని ఇందులో ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటుకానుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/