Begin typing your search above and press return to search.

కరువు పోరులో కడవెత్తుకున్న జగన్

By:  Tupaki Desk   |   2 May 2016 9:43 AM GMT
కరువు పోరులో కడవెత్తుకున్న జగన్
X
వైసీపీ అధినేత జగన్ బిందె పట్టారు.. నీటి కరువును తట్టుకోలేకపోతున్నామంటూ బిందె బుర్రపై పెట్టుకుని కదిలారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులన్నీ బిందెలతో పరుగులు తీశాయి. క‌ర‌వుపై గుంటూరు జిల్లా మాచ‌ర్ల‌లో వైసీపీ చేప‌ట్టిన‌ ధ‌ర్నాకు మంచి స్పందనే వచ్చింది. మాచ‌ర్ల‌ మున్సిప‌ల్ ఆఫీస్ నుంచి ఖాళీ బిందెల‌తో వైసీపీ ర్యాలీ చేప‌ట్టింది. ర్యాలీలో పాల్గొన్న జ‌గ‌న్ ఖాళీ బిందెతో నిర‌సన వ్య‌క్తం చేశారు. తలపై ఖాళీ బిందెను మోసి, నిరసన తెలిపారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ... ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. క‌ర‌వు స‌మ‌స్య తీరేవ‌ర‌కు వైసీపీ త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తుంద‌ని తెలిపారు. క‌రువు ప‌రిస్థితుల‌పై టీడీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలోని రైతులకు పంగనామాలు పెట్టారని వ్యాఖ్యానించారు. రైతులకు ఒక్క రూపాయి ఇన్‌ పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని, పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పాలమూరు - డిండి ప్రాజెక్టులపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రాయలసీమకు దక్కాల్సిన నీటిపై తెలంగాణను ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు.

చంద్ర‌బాబు పాల‌న అంతా మోసం - ద‌గా అని జగన్ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. మాచ‌ర్ల ప‌ట్ట‌ణంలో తాగ‌డానికి నీళ్లు లేవని అన్నారు. తెలంగాణ‌కు నీళ్ల‌ను మ‌ళ్లించేలా పాల‌మూరు ప్రాజెక్టును క‌డుతున్నా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేదని దుయ్య‌బ‌ట్టారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఎత్తిపోత‌ల ద్వారా కేసీఆర్ కృష్ణా నీటిని మ‌ళ్లిస్తున్నారని మ‌రి ఆంధ్ర ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ పై చంద్ర‌బాబు ఒక్క‌మాట కూడా మాట్లాడ‌రని విమ‌ర్శించారు. అప్ప‌ట్లో బుగ్గ‌వాగు నుంచి మాచ‌ర్ల‌కు తాగునీటిప‌థ‌కానికి వైఎస్ రూ.17కోట్లు మంజూరు చేశారన్నారు. దానిపై రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్లక్ష్యం వ‌హిస్తోంద‌ని విమ‌ర్శించారు.

గోలివాగు - జ‌ర్రివాగు ప‌థ‌కాలను గురించి కూడా అడిగేవారు లేరని వ్యాఖ్యానించారు. రైతుల‌కి నీళ్లు ఎలా ఇవ్వాలో సీఎం ఆలోచించ‌డం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చిన రుణ‌మాఫీ వ‌డ్డీలోని మూడో వంతుకు కూడా స‌రిపోద‌ని అన్నారు. ‘డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామ‌న్నారు చేయలేదు - బాబు వ‌చ్చినా జాబ్ రాలేదు - పేద‌ల‌కు ఇంత‌వ‌ర‌కూ ఇళ్లు క‌ట్టించ‌లేదు’ అని విమ‌ర్శించారు. ‘రెండు చేతులు పైకెత్తి చెప్పండి.. ఇళ్లు క‌ట్టిచ్చారా..? జాబ్ ఇచ్చారా..? క‌రువు ప‌రిస్థితిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారా..?’ అని ప్రజల నుంచి సమాధానం చెప్పించే ప్రయత్నం చేశారు.