Begin typing your search above and press return to search.

జగన్ కోర్టులో ఆ నేతల పంచాయితీ

By:  Tupaki Desk   |   9 Oct 2019 11:03 AM GMT
జగన్ కోర్టులో ఆ నేతల పంచాయితీ
X
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల పంచాయితీ ఆ పార్టీ అధినేత - సీఎం జగన్ వద్దకు చేరింది. నేతల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరుపై జగన్ సీరియస్ అయ్యి వారిని బుధవారం సాయంత్రం క్యాంప్ ఆఫీసుకు రమ్మన్నట్టు తెలిసింది.

ప్రధానంగా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి - కాకాణి గోవర్ధన్ రెడ్డిలు రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరు సలుపుతున్నట్టు అధిష్టానానికి నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - ఎమ్మెల్యే కోటంరెడ్డిలు ఒక వర్గంగా ఉండగా.. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి - మరో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి - మరో నేేత మేకపాటి రాజా మోహన్ రెడ్డి - మిగిలిన నేతలు మరో వర్గంగా చీలిపోయారు. జిల్లా నేతల మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

తాజాగా జిల్లా అధ్యక్ష పదవి కావాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేయడం ‘కాకాని’కి కోపం తెప్పించింది. రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్ష బాధ్యతలను కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించారు. క్రమశిక్షణాపరంగా కాకాని బెటర్ గా ఉన్నారు.

ఇక ఇటీవల వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో కాకాని వర్గం జోక్యం ఉందని వారు అనుమానిస్తున్నారు. అందుకే కోటంరెడ్డికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.

దీంతో కోటంరెడ్డి, కాకాని మధ్య పంచాయతీ జిల్లాలో అభివృద్ధి - పార్టీకి చేటు తెస్తుందని జగన్ కు తెలిసింది. దీంతో వారిని సెట్ రైట్ చేసేందుకు క్యాంప్ ఆఫీసుకు పిలిపించినట్టు తెలిసింది. మంత్రి - ఎంపీలు ఇలా వర్గాలుగా చీలిపోయి ఆధిపత్య పోరు సలిపితే పార్టీకే నష్టం అని జగన్ వారిని దారిలో పెట్టేందుకు బుధవారం సాయంత్రం పంచాయితీ చేయడానికి పిలిపించినట్టు తెలిసింది.