Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు సీఎంల మ‌హా ప్లాన్..కృష్ణ‌లోకి గోదావ‌రి!

By:  Tupaki Desk   |   23 Jun 2019 4:29 AM GMT
ఇద్ద‌రు సీఎంల మ‌హా ప్లాన్..కృష్ణ‌లోకి గోదావ‌రి!
X
ఇటీవ‌ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోట ఒక మాట ప‌దే ప‌దే వినిపిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ఆ రాష్ట్రంలో సంబంధాలు మ‌రో స్థాయికి వెళ్ల‌టంతో పాటు.. ఇరు రాష్ట్రాలు క‌లిసి ప్రాజెక్టుల‌లో నీటిని మ‌రింత ప‌క్కాగా వినియోగించుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట చెబుతున్నారు. నీళ్ల పంపిణీకి సంబంధించి రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న పంచాయితీల్ని ప‌క్క‌న పెట్టేసి.. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణిలో నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్న మాట‌ల్ని చెప్ప‌టం.. ఇందుకు జ‌గ‌న్ సానుకూలంగా స్పందించ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక కొత్త ప్లాన్ ను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. గోదావ‌రి నుంచి శ్రీ‌శైలం ప్రాజెక్టు వ‌ర‌కూ నీటిని మ‌ళ్లించ‌టానికి ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేయాల‌న్న యోచ‌న‌లో ఇద్ద‌రు సీఎంలు ఉన్నార‌న్న కొత్త విష‌యం తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఈ భారీ ఐడియా ఇరువురు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. త్వ‌ర‌లో తాము క‌లిసే స‌మావేశంలో ఈ అంశంపైన మ‌రింత అధ్య‌య‌నం చేయాల‌ని.. మాట్లాడుకోవాల‌న్న ప్రాథ‌మిక ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా జ‌గ‌న్ నిర్వ‌హించిన ఇరిగేష‌న్ అధికారుల స‌మావేశంలో.. ఈ అంశాన్ని చ‌ర్చ‌కు తెచ్చి మ‌రింత అధ్య‌య‌నం చేయాల‌న్న మాట చెప్పిన‌ట్లుగా స‌మాచారం.

ఇంద్రావ‌తి గోదావ‌రిలో క‌లిసిన త‌ర్వాత నీటిని మ‌ళ్లించేలా ప‌థ‌కం చేప‌ట్టి.. నేరుగా శ్రీ‌శైలంలోకి తీసుకెళితే క‌ర‌వు ప్రాంతానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని.. ఈ ప‌థ‌కం ఇరు రాష్ట్రాల‌కు మేలు చేస్తుంద‌న్న మాట కేసీఆర్ చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప‌థ‌కం చేప‌ట్ట‌టానికి తాము పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని జ‌గ‌న్ కు కేసీఆర్ చెప్పిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. ఈ ప‌థ‌కాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మ‌డిగా చేప‌ట్టాలా? లేక విడిగా చేప‌ట్టాలా? అన్న ఆలోచ‌న‌పై మ‌ధ‌నం జ‌రుగుతోంది.

తాజాగా జ‌రిగిన అధికారుల స‌మావేశంలో మాట్లాడిన జ‌గ‌న్‌.. ప్రాణ‌హిత ద్వారా నీరు ఎంత వ‌స్తోంది? ఇందులో కాళేశ్వ‌రం ద్వారా మ‌ళ్లించే నీరెంత‌? దిగువ‌న ఇంద్రావ‌తి న‌దిలో ఎంత ప్ర‌వాహం ఉంటుంది? ఇలా ప‌లు అంశాలు ఇరు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య జ‌రిగిన మాట‌ల్లో వ‌చ్చాయ‌ని చెబుతున్నారు.

కాళేశ్వ‌రం నీటి శ్రీ‌శైలంకు త‌ర‌లిస్తే తెలంగాణ‌లోని క‌ల్వ‌కుర్తి.. శ్రీ‌శైలం ఎడ‌మ‌గ‌ట్టుకాలువ‌.. పాల‌మూరు-రంగారెడ్డి.. దిండి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని నీళ్లు మ‌ళ్లించే వీలు ఉంటుంది. అదే విధంగా ఏపీ విష‌యానికి వ‌స్తే.. హంద్రీ-నీవా, గాలేరు-న‌గ‌రి, తెలుగు గంగ ప్రాజెక్టుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెబుతున్నారు. ప్రాథ‌మికంగా ఉన్న ఈ ఆలోచ‌న రానున్న రోజుల్లో మ‌రింత విస్తృత స్థాయిలో స‌మాలోచ‌న‌లు జ‌రిగే అవకాశం ఉందని చెప్ప‌క త‌ప్ప‌దు.