జగన్ గెలుపుకు కారణం అదే అవుతుందా?

Mon Apr 22 2019 10:26:48 GMT+0530 (IST)

'ఆయనకూ ఒక ఛాన్స్ ఇద్దాం..' అనేదే ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ అయ్యిందనే అభిప్రాయం వినిపిస్తూ ఉంది. 'జగన్ నూ ఒకసారి చూద్దాం..' అనే మాట ప్రజల నుంచి బాగా వినిపించిందని పరిశీలకులు అంటున్నారు. ఏతావాతా చూస్తే పోలింగ్ లో కూడా ఇదే అభిప్రాయమే ప్రతిఫలించిందని ఇదే జగన్ గెలుపుకు - వైఎస్సార్సీపీ విజయానికి కారణం కావొచ్చనే అంచనాలు - అభిప్రాయాలు వ్యక్తం  అవుతున్నాయి.



విశేషం ఏమిటంటే.. ఈ అంశాన్ని తెలుగుదేశం శ్రేణులు కూడా కొంత వరకూ ఒప్పుకుంటున్నాయి. 'జగన్ కూ ఒక ఛాన్స్ ఇద్దాం..' అనే అభిప్రాయం జనాల్లో ఉందని వారు కూడా అంటుండటం విశేషం. ఒకవైపు తామే గెలుస్తామని తెలుగుదేశం అధినేత ధీమా చెబుతూ ఉన్నారు. అయితే ఆ పార్టీ నేతలు - కార్యకర్తలు మాత్రం క్షేత్ర స్థాయిలో.. 'జగన్ కూ ఒక ఛాన్స్..' అనేది మంత్రంగా పని చేసిందని ఒప్పుకుంటున్నారు!

జగన్ ఐదేళ్ల నుంచి కాదు - అంతకు ముందు నాలుగేళ్ల నుంచి కూడా జనం మధ్యనే ఉన్నారు. తొమ్మిదేళ్లుగా జగన్ దాదాపుగా ప్రతిపక్షంగా ఉంటూ వచ్చారు. ఏదో ఒక యాత్ర చేపట్టడం - వివిధ ప్రజా పోరాటాలు - వివిధ అంశాల గురించి స్పందించడం.. ఇలా నిత్యం జనం మధ్యనే ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి.

ఆ ఇంప్రెషన్ జనం మీద పడిందని - వైఎస్ కుమారుడిగా - ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా జగన్ గత ఎన్నికల్లో కొంత వరకూ విజయవంతం అయ్యారు. ఇక ముఖ్యమంత్రి గా కావడం విషయంలో జగన్ ఈ సారి విజయవంతం అయ్యుండే అవకాశాలే ఎక్కువని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

రాజకీయంలో ఎన్నికల ఫలితాలను చాలా విషయాలు ప్రభావితం చేస్తాయని - అన్నింటికి మించి ప్రభావితం చేసే అంశం ప్రజాభిప్రాయం అని.. అదొక వేవ్ లా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అలాంటి వేవ్ జగన్ కు అనుకూలంగా ఉండవచ్చని.. 'జగన్ కూ ఒక ఛాన్స్ ఇద్దాం.. ఆయన తండ్రి పాలన బాగుండేది.. అలాంటి పాలన ఇస్తాడేమో చూద్దాం..' అనే టాక్ ప్రజల మధ్యన పోలింగ్ వరకూ నడిచిందని.. అదే ఈ ఎన్నికల తీర్పును గట్టిగా ప్రభావితం చేసి ఉండే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక అసలు కథ ఏమిటో.. మే ఇరవై మూడున తెలుస్తుంది!