వైఎస్ జగన్ వర్సెస్ బాబు..అసెంబ్లీ ఎలా ఉంటుందో!

Tue Jun 11 2019 15:13:23 GMT+0530 (IST)

ఇది వరకూ అసెంబ్లీలో ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. అయితే గత ఐదేళ్లలో అసెంబ్లీలో ఏ మాత్రం స్వాగతించ కూడదని అంశాలు చోటు చేసుకున్నాయి. అధికార పక్షానికి - ప్రతిపక్షానికి మధ్యన గత ఐదేళ్లలో సభలో ఏ మాత్రం సహృద్భావ వాతావరణం కనిపించలేదు.దూషణలు - దారుణమైన పదజాలాలు కూడా  అసెంబ్లీలో చోటు చేసుకున్నాయి. ఆఖరికి తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని - ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపజేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీని బహిష్కరించింది. ప్రతిపక్ష పార్టీ ఆఖరి ఏడాదిలో సభకే హాజరు కాలేదు!

తెలుగుదేశం - బీజేపీలే సభకు వెళ్లాయి. వారితోనే సమావేశాలు జరిగాయి. అలా ప్రతిపక్షమే లేకుండా సభ సాగింది. ఫిరాయింపు రాజకీయాలు అలాంటి పరిస్థితిని తీసుకు వచ్చాయి.  ఇక ఇప్పుడు అసెంబ్లీలో కొత్త సమరానికి తెర లేవనుంది. అధికార పక్ష నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తలపడనున్నారు.

గతంలో  చంద్రబాబు నాయుడు వేర్వేరు ముఖ్యమంత్రులున్నప్పుడు సభలో ఉన్నారు. ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి  తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆ తర్వాత రోశయ్య - కిరణ్ లు  సీఎంలుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు జగన్ సీఎంగా కూర్చుంటుండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు.
 
మరి వీరిద్దరి మధ్యన సమరం ఎలా ఉంటుందో గత ఐదేళ్లుగా ఒక యాంగిల్ లో చూశారు ఏపీ జనాలు - ఇక నుంచి మరో తీరున ఉండబోతోంది వ్యవహారం!