Begin typing your search above and press return to search.

గంటా ప్ర‌త్య‌ర్థికి వైసీపీలో కీల‌క ప‌ద‌వి... !

By:  Tupaki Desk   |   18 July 2019 4:22 AM GMT
గంటా ప్ర‌త్య‌ర్థికి వైసీపీలో కీల‌క ప‌ద‌వి... !
X
ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో ఘన విజయంతో ఊపుమీదున్న‌ సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరిగే పలు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై దృష్టి సారించారు. రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల పాలకమండళ్ల‌ గడువు పూర్తికావడంతో వీటికి ఎన్నికలు జరగనున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తిరుగులేని విజయం సాధించినట్లుగానే... స్థానిక సంస్థలను క్లీన్‌ స్వీప్ చేయాలన్న టార్గెట్ తో జగన్ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు... మూడు నెలల్లో జరిగే జీవిఎంసీ ఎన్నికలు సీఎంగా జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి.

తాజా ఎన్నిక‌ల్లో టిడిపి కేవలం 23 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం అయినా... గ్రేటర్ విశాఖలో నాలుగు సీట్లలోనూ వైసీపీని ఓడించింది. దీంతో రాష్ట్రంలోని పెద్ద పెద్ద నగరమైన విశాఖ నగరంపై తమ పార్టీ జెండా ఎగరవేయాల‌న్న‌ ప్రణాళికలతో జగన్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన వీఎంఆర్డీఏ పదవిని పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఆశించినా వారిని కాదని ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కు అప్పగించారు.

వివాదరహితుడిగా ఉండడంతో పాటు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న నేత కావడంతో శ్రీనివాస్ కు ఈ పదవి దక్కింది. వాస్తవానికి ఈ పదవిని జగన్ వర్గానికి చెందిన కొయ్య ప్రసాద‌రెడ్డి... సత్తి రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు ఆశించారు. జగన్ మాత్రం శ్రీనివాస్ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే కీలకమైన మేయర్ పదవి కోసం పార్టీ నుంచి ప‌లువురు రేసులో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో తూర్పు టిక్కెట్ ఆశించి భంగపడ్డ నగర పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు... ఎన్నికల్లో నార్త్ నుంచి పోటీ చేసి మంత్రి గంటాకు ముచ్చెమటలు పట్టించిన కేకే రాజు సైతం ఉన్నారు. తనంత తానుగా మేయర్‌ పదవిగానీ మరే ఇతర పదవి కావాలని కేకే రాజు కోరనప్పటికీ సీఎం జగన్‌ కు కేకే రాజుపై సానుభూతి ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఎన్నిక‌ల్లో ఓడినా కూడా జ‌గ‌న్ కేకే రాజును పోరాట యోధుడు నువ్వు ఓడి గెలిచావ‌ని ఆయ‌న్ను ప్ర‌శంసించారు. దీంతో మ‌రి జ‌గ‌న్ అంచ‌నాల‌కు భిన్నంగా ఆలోచిస్తే కేకే.రాజుకే విశాఖ మేయ‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు.