Begin typing your search above and press return to search.

జగన్ గెలిస్తే..హోంమినిస్టర్..వాళ్లిద్దరిలో ఎవరు!

By:  Tupaki Desk   |   20 April 2019 6:18 AM GMT
జగన్ గెలిస్తే..హోంమినిస్టర్..వాళ్లిద్దరిలో ఎవరు!
X
ఎన్నికలకు ముందే విజయం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో కనిపించింది. గత ఎన్నికల్లో ఏవో కొన్ని పొరపాట్లతో తాము ఓడిపోయినా - ఈ సారి ఎన్నికల్లో మాత్రం తమదే విజయం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ధీమాతో కనిపించింది. దానికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నేషనల్ మీడియా కూడా గట్టిగా ప్రిడిక్ట్ చేసింది. ప్రీ పోల్ సర్వేలు చాలా వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయం అని తేల్చి చెప్పాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం లాంటి విజయాన్ని సాధిస్తుందని కొన్ని సర్వేలు అంచనా వేశాయి కూడా.

ఇక పోస్ట్ పోల్ పరిణామాలు ఎలా ఉంటాయనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఏ ఎగ్జిట్ పోల్సో విడుదల అవుతాయని అనుకుంటే.. వాటికి కూడా ఈసీ బ్రేక్ వేసింది. మరో నెల రోజుల వరకూ ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల అయ్యే అవకాశాలు లేవు. దీంతో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయనే అంశం గురించి శాస్త్రీయమైన అభిప్రాయాలు లేవు. అన్నీ ఊహాగానాలే. ఎవరి లెక్కలు వారివి - ఎవరి అంచనాలు వారివి - ఎవరి ఆశలు వారివి!

ఇలాంటి నేపథ్యంలో.. విజయాల మీదే కాదు - మంత్రి పదవుల విషయంలో కూడా ఆసక్తిదాయకమైన ఆఫ్ ద రికార్డ్ వార్తలు వస్తున్నాయి. కొందరి విషయంలో అయితే కేబినెట్ బెర్తులు కూడా ఖరారనే మాట వినిపిస్తూ ఉంది! ప్రత్యేకించి హోం శాఖ విషయంలో ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తూ ఉండటం విశేషం. వాళ్లే కొడాలి నాని - ఆర్కే రోజా. వీళ్లిద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున.. హోం శాఖ మంత్రి పదవి రేసులో ఉన్నట్టే అని టాక్.

గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా అండగా నిలిచిన వారు వీళ్లు. అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ నుంచి బాగా ఆటుపోట్లను ఎదుర్కొన్న వాళ్లు కూడా వీళ్లే. వీళ్లను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి తెలుగుదేశం గట్టిగా ప్రయత్నించింది. అందులో భాగంగా చిత్రహింసలు పెట్టినంత పని చేసింది. అయినా ఓర్చుకుని నిలిచిన వీరికి.. ఇప్పుడు జగన్ కీలకమైన మంత్రి పదవినే కేటాయించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే.. జగన్ వీరికి ప్రాధాన్యత కల్పించే అవకాశాలున్నాయని అంటున్నారు.