పేదల దరికి చేరేలా జగన్ సంచలన నిర్ణయం

Tue Jun 11 2019 10:35:12 GMT+0530 (IST)

వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. అమరావతి రాజధానిలోని వెలగపూడిలో కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. నిత్యవసర సరుకుల పంపిణీని సరళతరం చేస్తున్నారు. పేదలకు నిత్యావసర సరుకులను ఇంటివద్దకే చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్యాకింగ్ సిస్టంను ప్రవేశపెడుతున్నారు.. రేషన్ లబ్ధిదారులకు బియ్యం సహా రేషన్ వస్తువులను ప్యాకెట్లలో ప్యాక్ చేసి వాళ్ల ఇంటికే అందజేసేలా వినూత్న ప్రయోగానికి జగన్ శ్రీకారం చుడుతున్నారు.రేషన్ అక్రమాలను అరికట్టేందుకే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చౌకధరల డిపోల ద్వారా  రేషన్ ఇతర వస్తువులు పక్కదారి పడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయి. రేషన్ బియ్యాన్ని అమ్ముకొని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అందుకే ఈ అక్రమాలను అరికట్టేందుకు జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం బియ్యాన్ని ప్యాకెట్లుగా మార్చడం ద్వారా పాకెట్లను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రను వేసి అవినీతిని అరికట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. 5 -10 - 20 కేజీల ప్యాకెట్లలో బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. ఈ ప్యాకెట్ల బియ్యాన్ని తస్కరించడం కష్టం కాబట్టి అవినీతికి ఆస్కారం ఉండదని భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు.

జగన్ ప్యాకెట్ సిస్టం రేషన్ సరుకుల పంపిణీతో ఇక రేషన్ షాపుల్లో తూకాలకు చెల్లు చీటీ పడనుంది. ఇక తూకం వేయడం.. డీలర్లకు చేర్చడం ఉండదు. ఫలితంగా ఎక్కడా అక్రమాలు చేయడానికి.. తరలించడానికి ఆస్కారం ఉండదు.  ఇక లబ్ధిదారులకు బియ్యం అందిన వెంటనే వారికి చేరిందని ఫోన్లకు ఎస్ఎంఎస్ అందేలా పారదర్శకతను పాటించాలని జగన్ నిర్ణయించారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉండదని భావిస్తున్నారు.

ఈ డోర్ డెలివరీ సిస్టాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం గ్రామ వాలంటీర్లకు అప్పగించాలని నిర్ణయించింది. సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడానికే ఈ వాలంటీర్లను నియమించామని జగన్ ఇదివరకు ప్రకటించారు.  ఇందుకోసం ప్రతీనెల 5000 రూపాయల గౌరవ వేతనాన్ని అందిస్తామని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.