సంచలనం: బాబు చేయనిది.. జగన్ చేశాడు..

Sun May 26 2019 17:24:28 GMT+0530 (IST)

పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు 2014లో అధికారంలోకి రాగానే ఆవురావురుమంటూ ఎగబడ్డారు. ప్రభుత్వ పనులు ఇసుక మైనింగ్ లపై పడి దోచుకున్నారన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి.. చంద్రబాబు కూడా వారి కరువు తీరడానికి సహకరించారన్న ఆరోపణలున్నాయి.. కానీ ఐదేళ్లు గడిచేసరికి ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులను కంట్రోల్ చేయలేని చంద్రబాబు నిండా మునిగారని.. అవినీతి హంగు ఆర్బాటాలే చంద్రబాబును ముంచాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఆ విషయం తెలిసి వైఎస్ జగన్ ముందే జాగ్రత్త పడ్డారు. తాజాగా మోడీని కలిసిన అనంతరం ఏపీ భవన్ లో విలేకరులతో మాట్లాడిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాలనలో పారదర్శకత జవాబుదారీతనం తెచ్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని చెప్పారు. అంతేకాదు.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అవినీతికి పాల్పడ్డ వదిలేది లేదని.. ఈ విషయంలో తనకు ప్రజలే ముఖ్యమని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కూడా ఇదే విషయం చెప్పానని అన్నారు.. ఏ ఎమ్మెల్యే ఎంపీల అవినీతిపై ఏ చిన్న విషయం తన దృష్టికి వస్తే అదే వారికి చివరి రోజు వస్తుందని హెచ్చరించారు.

అంతేకాదు.. తాను ఏం చేయకున్నా వైఎస్ చనిపోయాక తనను టార్గెట్ చేసి అవినీతి ఆరోపణలు చేసి జైలుకు పంపారని.. అందుకే ఇక అవినీతి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని జగన్ వివరించినట్టు తెలిసింది.

జగన్ గెలవగానే అవినీతిపై కఠిన నిర్ణయం తీసుకోవడం..చేయవద్దని ఎమ్మెల్యేలు ఎంపీలకు సూచించడం సంచలనంగా మారింది. 2014లో టీడీపీ అధినేత ఇలా చెప్పకపోవడమే ఇప్పుడు ఆయనను చిత్తుగా ఓడించి భవిత లేకుండా చేసిందన్న టాక్ ఉంది. జగన్ రాగానే ఇలాంటి  కఠిన నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని అర్థమవుతోంది.

జగన్ హెచ్చరిక వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో గుబులు రేపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పదేళ్లు ప్రతిపక్షంలో వైసీపీ నేతలు కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది రాబట్టుకోవడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయి.  అందుకే ముందస్తుగా జగనే కంట్రోల్ చేయడంతో వారు అటువైపు చూసే అవకాశాలు ఉండవు. నాయకుడు సరైనవాడు అయితే ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతికి పాల్పడకుండా ఉంటారు.. రాష్ట్రం బాగుపడుతుంది.  జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ భవిష్యత్ కు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.