పాజిటివ్ మోడ్ లో పశ్చిమ పాదయాత్ర..!

Tue Jun 12 2018 14:08:38 GMT+0530 (IST)

కోస్తా జిల్లాలు ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రజలు ఎటువైపు మొగ్గితే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సమైక్య రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం విడిపోయినా ఈ జిల్లాల సెంటిమెంట్ లో ఏ మాత్రం తేడా లేదు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఈ సారి ఎవరికి ఓటేస్తారు ? అన్నది చర్చానీయాంశంగా మారింది. 2300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు పశ్చిమ గోదావరిలో ముందుకు సాగుతున్నారు.గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరిలోని 15 జిల్లాలకు గాను 14 స్థానాలలో టీడీపీ విజయం సాధించింది. మిగిలిన స్థానం మిత్రపక్షం అయిన బీజేపీ గెలుచుకోగా వైసీపీ ఖాతా తెరవలేక పోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో వైఎస్ జగన్ కు పాలనానుభవం లేదు కాబట్టి ఆంద్రప్రదేశ్ ఇబ్బందులు పడుతుందన్న ఎల్లో మీడియా ప్రచారం వైసీపీకి పెద్ద మైనస్ కాగా నరేంద్రమోడీ హవా - పవన్ కళ్యాణ్ ఛరీష్మా మూలంగా ఈ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణం అయ్యాయి. అయితే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవడం - మోడీ - పవన్ లు చంద్రబాబుకు దూరం కావడం వైసీపీకి కలిసొచ్చే అంశం.

తేలిపోయిన చంద్రబాబు విజన్

గత ఎన్నికలకు ముందు ఆంధ్రా ప్రజల ముందు ఉన్న ఆలోచన ఒక్కటే 9 ఏండ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు. రాజధానిని నిర్మిస్తాడు. పెట్టుబడులు రప్పించ గలుగుతాడు అని భావించారు. ఈ నాలుగేళ్లలో పత్రికలలో ప్రచారం తప్ప బాబు రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు లేవు. చేసిన అభివృద్ది అంతకంటే లేదు. ఇక అమరావతి రాజధాని అంటూ నాలుగు సార్లు శంకుస్థాపన చేసి వందల కోట్లతో తాత్కాలిక భవనాలు మాత్రమే నిర్మించి అందులోనూ అవినీతి ఆరోపణలను ఎదుర్కొని ప్రజల దృష్టిలో విఫల ముఖ్యమంత్రిగా నిలిచిపోయాడు. ప్రతి ఏటా నవనిర్మాణ దీక్షలు అంటూ ప్రజల సొమ్మును వృధాగా ఖర్చు చేయడం పెట్టుబడుల కోసం అంటూ దావోస్ కు యాత్రలు చేసి ఉట్టి చేతులతో తిరిగి రావడం విశాఖలో పరిశ్రమలతో ఒప్పందాలు అంటూ హంగామా చేయడంతో ప్రజలకు బాబు అసలు రూపం తెలిసిపోయింది. ప్రత్యేకహోదా వద్దు అని ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు తిరిగి హోదా అంటూ బీజేపీతో పేచీకి దిగడంతో ఆయనకున్న ఆలోచన ఎంత అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలంతా బాబును ఏవగించుకునే పరిస్థితి వచ్చింది.

జగన్ యాత్రపై బాబు కన్ను

గత ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ పొత్తు మూలంగా ఏలూరు ఎంపీగా మాగంటి బాబు నరసాపురం ఎంపీగా బీజేపీ నేత గంగరాజు గెలిచారు. ఈ సారి ఇక్కడి నుండి చంద్రబాబు కొత్త ముఖాలను రంగంలోకి దించుతారని తెలుస్తుంది. ఇక జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ వచ్చే ఎన్నికల్లో కనీసం పది స్థానాలు గెలవాలన్న లక్ష్యంగా సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నప్పటికీ కాపులు గతంలోలా ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు. కాపులకు చంద్రబాబు పవన్ చేసిన మోసాన్ని చూపుతూ వైసీపీ వారికి దగ్గరవుతుంది. ఇక జగన్ పాదయాత్ర విజయవంతం నేపథ్యంలో వేగుల ద్వారా చంద్రబాబు జగన్ ను కలుస్తున్న వారి చిట్టాను లాగుతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలాఉంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో వేటిని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయాడు. సాధారణ కమ్మ కాపు వర్గాలు రెండింటికీ చంద్రబాబు దూరమయ్యాడు. ఈ వైఫల్యాలనే జగన్ గుర్తించి సాధారణ మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించగా ఎవరికి వారు నియోజకవర్గాలకు తామే సర్వస్వం అన్నట్లు నియంతృత్వ పోకడలతో ప్రజలను పట్టించుకోకుండా దూరం అయ్యారు. ఈ నేపథ్యంలో బాబు నాలుగేళ్ల పాలనను చూసిన ప్రజలు ఒక సారి జగన్ కు అవకాశం ఇస్తే తప్పేముందని భావిస్తున్నట్లు తెలుస్తుంది.