Begin typing your search above and press return to search.

ప్ర‌జ‌లే నాకున్న ఆస్తి: జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   16 Aug 2017 9:53 AM GMT
ప్ర‌జ‌లే నాకున్న ఆస్తి: జ‌గ‌న్‌
X
నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు మూడున్న‌రేళ్ల పాల‌న‌ను దుయ్య‌బ‌ట్టారు. నంద్యాల ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. డ‌బ్బు, అధికారంతో నంద్యాల ఓట‌ర్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నార‌న్నారు. ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబు నాయుడు మూడున్న‌రేళ్ల పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఓటు వేయాల‌ని జ‌గ‌న్ అన్నారు. విశ్వ‌స‌నీయ‌త అనే ప‌దానికి అర్థం తీసుకురావ‌డానికి వైసీపీకి ఓటేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ధ‌ర్మానికి తోడుగా, అధర్మానికి వ్యతిరేకంగా ఓటు వేయాల‌ని జ‌గ‌న్ అన్నారు. నంద్యాల‌లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ రోజు నంద్యాల‌లోని చింత అరుగులో జ‌రిగిన‌ రోడ్ షో సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

నంద్యాల ప్ర‌జ‌లు వేసే ఓటు ఎవ‌రినో ఒక‌రిని ఎమ్మెల్యే చేసేందుకు మాత్రమే కాదని, చంద్ర‌బాబు మూడున్న‌రేళ్ల మోస‌పూరిత పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేయ‌బోతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్ప‌టికీ నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చంద్రబాబులా తాను అబద్దాలు చెప్ప‌న‌ని, విశ్వసనీయతే తనకున్న ఆస్తి అని జగన్ అన్నారు. ధర్మాన్ని బతికించాలని, వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉప ఎన్నికలు వచ్చే వరకు చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులను నంద్యాలలో ఎప్పుడైనా చూశారా అని జ‌గ‌న్ ప్రశ్నించారు.

గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబు మూడేన్న‌రేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? అని ప్ర‌శ్నించారు. వైఎస్‌ఆర్‌ పాలనలో నంద్యాల‌లో 21,800 పెన్షన్లు ఉన్నాయ‌ని, బాబు పాలనలో వాటిని 15 వేలకు కుదించారని మండిప‌డ్డారు.

చంద్రబాబు పాలనలో రేషన్‌ బియ్యం తప్ప ఇంకేమీ రావడం లేదని, నంద్యాలలో కాలనీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని జ‌గ‌న్ చెప్పారు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు వస్తే జాబు వస్తుందన్నారని, జాబు రాకపోతే రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్దానాన్ని నిల‌బెట్టుకోలేద‌ని తెలిపారు.

2014 ఎన్నిక‌ల అనంత‌రం కర్నూలులో జ‌రిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని, కర్నూలుకు ఎయిర్‌పోర్టు, ట్రిఫుల్‌ ఐటీ తెప్పిస్తామ‌ని బూట‌క‌పు వాగ్దానాలు చేశార‌ని జ‌గ‌న్ అన్నారు. క‌ర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తామని, ఉర్దూ యూనివర్సిటీ, మైనింగ్‌ స్కూల్‌ తెస్తామని మాట ఇచ్చి త‌ప్పార‌న్నారు. సీఎం స్థాయిలో ఇచ్చిన వాగ్దానాల‌ను త‌ప్పిన చంద్ర‌బాబు మ‌రోసారి నంద్యాల‌ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

నంద్యాల ఎన్నిక‌ల్లో చంద్రబాబు త‌న అధికార బ‌లాన్ని ఉప‌యోగించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెడుతున్నార‌ని, పోలీసు బలంతో, డబ్బులతో ఎవరినైనా కొనేయగలననే అహంకారం చంద్రబాబుకు పెరిగిపోయిందని జ‌గ‌న్ అన్నారు. త‌న ద‌గ్గ‌ర చంద్ర‌బాబులాగా డ‌బ్బులు లేవ‌ని, లంచాలతో పోగేసిన డబ్బుతో చంద్ర‌బాబు ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపే చానళ్లు - పేపర్లు త‌న‌కు లేవని - దివంగ‌త మ‌హానేత వైఎస్ ఆర్ ఇచ్చిన ప్ర‌జా కుటుంబ‌మే త‌న‌కున్న పెద్ద ఆస్త‌ని జ‌గ‌న్ అన్నారు. జగన్‌ అబద్దం చెప్పడు, మోసం చేయడు.. వాళ్ల నాన్న మాదిరే మాటపై నిలబడతాడన్న ప్ర‌జ‌ల నమ్మకం, విశ్వసనీయతే త‌న బ‌ల‌మ‌ని జ‌గ‌న్ తెలిపారు. దేవుడి ద‌య‌, ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో నంద్యాల ఎన్నిక‌లో వైసీపీ త‌ప్ప‌క గెలుస్తుంద‌ని జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు.