Begin typing your search above and press return to search.

ఐదు పెళ్లిళ్ల బాబు..జ‌గ‌న్‌ కొత్త సూత్రీక‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   20 Aug 2018 4:48 PM GMT
ఐదు పెళ్లిళ్ల బాబు..జ‌గ‌న్‌ కొత్త సూత్రీక‌ర‌ణ‌
X
రాష్ట్రంలో అబ‌ద్ధాలు - అవినీతి - మోసాలు - అన్యాయం పాల‌న జ‌రుగుతుంద‌ని - దీనికి తోడు చంద్ర‌బాబు దుబారాతో రాష్ట్రం అప్పు..నిప్పుగా మారుతోంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. నాలుగేళ్ల‌లో చంద్ర‌బాబు దుబారా అక్ష‌రాల రూ.6 వేల కోట్లు అయ్యింద‌ని - ఈ నిధులు పోల‌వ‌రానికి ఖ‌ర్చు చేసి ఉంటే ఈ పాటికి నీరు వ‌చ్చేద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. రూ.6 వేల కోట్లు దుబారా చేసి - బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు అప్పు తీసుకురావ‌డం ధ‌ర్మ‌మేనా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అప్పు నిప్పు అవుతోంది. అక్రమ మైనింగ్‌ కు చంద్రబాబు డాన్‌. విశాఖలో సమ్మిట్‌ లు పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు - 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. తీరా చూస్తే ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవని ఆయ‌న మండిప‌డ్డారు. ‘ఎన్నికల సమయంలో డబ్బులిస్తే తీసుకోండి. కానీ ఓట్లు వేసే సమయంలో అబద్ధాల చెప్పే వారిని - మోసాలు చేసేవారిని బంగాళ ఖాతంలో కలిపేయండి. మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు విజ్ఙప్తి చేశారు.

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా సోమ‌వారం కోట వుర‌ట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ హాజ‌రైన వారిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ద‌గ్గ‌రుండి చంద్ర‌బాబు రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించార‌ని - రాష్ట్ర విభజ‌న‌కు కార‌ణ‌మైన కాంగ్రెస్‌ తో చంద్ర‌బాబు జ‌ట్టు క‌ట్టేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. నాలుగేళ్లు కేంద్రంలో బీజేపీతో కొన‌సాగిన వ్య‌క్తి త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టార‌ని దుయ్య‌బ‌ట్టారు. ``గతంలో ఓ ఛానల్‌ కు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్‌ ను బాయ్‌ కాట్‌ చేయలన్నారు. ఇప్పుడు మాత్రం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేశారు. రాహుల్‌ రాయబారం కోసం కుటుంబ సభ్యులను పంపారు. ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నారు.. వదిలేశారు. టీఆర్ ఎస్‌ - సీపీఐ - సీపీఎం - ఆఖరికి జనసేనను కూడా పెళ్లి చేసుకుని వదిలేశారు.ఇప్పుడు కాంగ్రెస్‌ ను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు.`` అంటూ చంద్ర‌బాబు తీరును ఎండ‌గట్టారు. బ్రిటిష్ పాల‌న మాదిరిగా చంద్ర‌బాబు రాష్ట్రంలో విభ‌జించు పాలించు సూత్రాన్ని పాటించి దోచుకుతింటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప‌ల్నాడు నుంచి ప్ర‌కాశం దాకా మైనింగ్ మాఫియా చేస్తున్నార‌ని - మైనింగ్ డాన్ చంద్ర‌బాబే అన్నారు. త‌న కుమారుడు లోకేష్ ప్యాకెట్ మ‌నీ కోసం రాష్ట్రంలో నాలుగేళ్లుగా అన్ని ర‌కాల చార్జీల బాదుడే బాదుడ‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేసి..వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడిచార‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తిలో అడుగు రూ.10 వేల చొప్పున నిర్మించిన టెంప‌ర‌రీ స‌చివాల‌యంలో బ‌య‌ట 3 సెంటీ మీట‌ర్ల వ‌ర్షం కురిస్తే..లోప‌ల 6 సెంటీమీట‌ర్ల నీరు క‌నిపిస్తుంద‌ని - ఇవాళ ఏకంగా పైక‌ప్పు ఊడిపోయింద‌ని తెలిసింద‌న్నారు. ఏపీ ప్రభుత్వం బాండ్ల ద్వారా నిధులు సమీకరిస్తూ ప్ర‌జ‌ల‌ను ఆయోమ‌యానికి గురి చేస్తుంద‌ని విమ‌ర్శించారు. అసలు బాండ్లు అంటే అప్పుచేసే విధానం తప్ప మరొకటి కాదని, అటువంటప్పుడు అమరావతి బాండ్లకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్వాతంత‍్ర్య దినోత్సవం కన్నా అమరావతి బాండ్లకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పుబట్టారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంను (సీపీఎస్‌) రద్దు చేస్తానని వైఎస్ జ‌గ‌న్ కీల‌క హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే చేసే తొలిపని ఇదేనని జగన్‌ అనే నేను హామీ ఇస్తున్నానని తెలిపారు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు టెండర్‌ రద్దు అంశంపై కూడా సీబీఐ ఎంక్వైరీ వేయాలని బొత్స డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజు కేంద్రంలో పౌరవిమానయాన మంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నిర్మించేందుకు ఎయిర్‌ పోర్టు అధికారిటీ ఆఫ్‌ ఇండియా గతంలో అశోక్‌ గజపతిరాజు శాఖ సంస్థ టెండర్‌ వేసిందన్నారు. ఎక్కువ శాతం వాటా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినా.. ఆ టెండర్‌ ను ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టి దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు - అశోక్‌ గజపతిరాజు కలిసి టెండర్‌ రద్దు చేశారన్నారు. ``రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. ఆక్వా రైతులకు యూనిట్‌ కు రూ.1.50కే కరెంట్‌ ఇస్తాం. పంటలు వేయకముందే మద్దతు ధర ప్రకటించి ఆ మేరకు అన్ని పంటలను కొంటాం. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తాం. కోల్డ్‌ స్టోరేజీలు - ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు - గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. సహకార రంగంలోని పాల కేంద్రాలను పునరుద్ధరిస్తాం. పాడి రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. ఆపరేటివ్‌ డెయిరీలను పునరుద్ధరిస్తాం. రైతులకు ప్రతి లీటర్‌ కు రూ.4 చోప్పున బోనస్‌ చెల్లిస్తాం. రూ.4 వేల కోట్లతో విపత్తుల నిధి ఏర్పాటు చేసి.. కరువు - వరదల నుంచి రైతులను ఆదుకుంటాం. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటంబానికి రూ. 5 లక్షలు ఇస్తాం. రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ లు లేకుండా చేస్తాం.’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.