Begin typing your search above and press return to search.

ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఎందుకో చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   23 May 2017 9:41 AM GMT
ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఎందుకో చెప్పిన జ‌గ‌న్‌
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌పై వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌కు సూటిగా స‌మాధానం ఇచ్చారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అనంత‌రం రాష్ట్రప‌తి ప‌ద‌వి అభ్య‌ర్థి విష‌యంలో ఎన్డీఏకు వైసీపీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌పై అధికార తెలుగుదేశం పార్టీతో పాటుగా విప‌క్షంలో ఉన్న క‌మ్యూనిస్టులు సైతం విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ ఆర్ క‌డ‌ప‌ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైఎస్ జగన్ పులివెందుల‌లో మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి పదవి కి పోటీ లేకుండా ఉండటమే సమంజసమ‌నే ఉద్దేశంతో తాము ఎన్డీఏకు మ‌ద్ద‌తిస్తామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో అన‌వ‌స‌రంగా, ఉద్దేశ‌పూర్వ‌కంగా వివాదం చేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

రాజ్యాంగపరంగా అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, స్పీకర్‌ పదవులకు పోటీ ఉండకూడదని, అత్యున్నత పదవులు ఏకగ్రీవమైతే వాటి హుందాతనం పెరుగుతుందని త‌మ పార్టీ భావిస్తోంద‌ని జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్ధి గెలుస్తారనేది అందరికీ తెలుసని జ‌గ‌న్ చెప్పారు. అలాంటి ప‌రిస్థితులు ఉన్నందుకే గెలిచే అభ్యర్థికే తాము మద్దతు పలుకుతున్నామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. గ‌తంలో కూడా తాము ఇదే విధానాన్ని అవ‌లంభించిన‌ట్లు వెల్ల‌డించారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు ఇచ్చామని జ‌గ‌న్ గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీలో కూడా స్పీకర్ ప‌ద‌వి విష‌యంలో కోడెల శివ‌ప్ర‌సాద రావుకు అలానే మద్దతిచ్చామ‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్డీఏకు మ‌ద్ద‌తు ఇస్తుంటే విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీ మ‌రి ఆనాడు ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని, త‌ప్పుప‌ట్ట‌లేద‌ని వైఎస్ జ‌గ‌న్ సూటిగా నిల‌దీశారు.

సీఎం చంద్రబాబు పరోక్షంగా సహకరించబట్టే పత్తికొండలో హత్యలు జరిగాయని, అందుకే స‌మ‌గ్ర విచారణ జ‌ర‌గాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. త‌మ పార్టీకి చెందిన నాయ‌కుడు నారాయణరెడ్డి హత్యకు స్ధానిక పోలీసులే సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి నేప‌థ్యంలో మళ్లీ వారితోనే విచారణ చేయించడం సరికాదని అన్నారు. ఈ హత్య కేసుపై సీబీఐ విచారణ జరగాలని జ‌గ‌న్ డిమాండ్ చేశారు. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని చంపితే పోటీ ఉండదనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు. నారాయణరెడ్డి మరణించినా ఆయన భార్య అభ్యర్థిగా పోటీలో ఉండొచ్చున‌ని జ‌గ‌న్ తెలిపారు. నారాయణరెడ్డి లేకపోయినా పత్తికొండలో 50వేల మెజార్టీ సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.5 కోట్ల మంది ప్రజల్లో ఒకరికే సీఎంగా ఉండే అవకాశం దేవుడు ఇస్తాడని అలాంటి స్థానంలో ఉన్న వ్య‌క్తి ప్ర‌జ‌ల మ‌న‌సులో స్థానం పొందేలా ఉండాలే త‌ప్ప క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు చేయ‌వ‌ద్ద‌ని జ‌గ‌న్ అన్నారు.