12 నుంచి జగన్ పాదయాత్ర షురూ!

Thu Nov 08 2018 19:57:09 GMT+0530 (IST)

గత నెల 25న వైసీపీ అధినేత - ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగన్ ఎడమ భుజానికి తీవ్రమైన గాయం కావడంతో ఆయనకు హైదరాబాద్ లోని సిటీన్యూరో ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం జగన్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమైనా....వైద్యుల సూచన ప్రకారం...లోటస్ పాండ్ లోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో గాయం నుంచి కొద్దిగా కోలుకున్న జగన్... ఈ నెల 12 నుంచి తన ప్రజాసంకల్ప యాత్రను పునఃప్రారంభించబోతున్నారని  వైసీపీ నేతలు తెలిపారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర కోసం ఆదివారంనాడు జగన్  విశాఖకు బయలుదేరి వెళ్లబోతున్నారని వారు తెలిపారు.

మరోవైపు - తనపై జరిగిన దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ  పిటిషన్ విచారణార్హతపై రేపు నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు నేడు తెలిపింది. దాంతోపాటు - వైసీపీ నేతలు వేసిన పిల్ - మరో పిటిషన్ కూడా విచారణకు రాబోతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు - డీజీపీ ఆర్పీ ఠాకూర్ జగన్ పై దాడి కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది - జగన్ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.