Begin typing your search above and press return to search.

మ‌హాభార‌తం...జ‌గ‌న్‌..కొత్త మార్పు

By:  Tupaki Desk   |   21 Jan 2017 5:06 PM GMT
మ‌హాభార‌తం...జ‌గ‌న్‌..కొత్త మార్పు
X
వైసీపీ అధినేత - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయంగా ప‌రిణతి సాధించే క్ర‌మంలో వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్రజా స‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకు నేరుగా క్షేత్ర‌స్థాయిలోకి వెళ్ల‌డం కావ‌చ్చు, పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు - కొత్త నాయ‌కుల‌ను చేర్చుకోవ‌డం ద్వారా వైసీపీని బ‌లోపేతం చేయ‌డం ఇలా విభిన్న అంశాల్లో జ‌గ‌న్ డైన‌మిజం పెరుగుతోంద‌నేది స్ప‌ష్ట‌మవుతోంది. అనేక అంశాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే జ‌గ‌న్ మార్పు వెనుక ఒక పుస్త‌కం ఉంద‌ని అంటున్నారు. పురాణాల్లో కీల‌క ఇతిహాసంగా పేరున్న మహాభారతాన్ని అధ్యయనం చేయ‌డం జ‌గ‌న్ దృక్కోణాన్ని మార్చింద‌నేది వీరి విశ్లేష‌ణ‌. స‌మ‌కాలీన‌ రాజ‌కీయాలు ఎలా ఉంటాయి, ప్ర‌జా నాయ‌కుడు ఏ విధంగా ఉండాలి, వాటిని ఎదుర్కునేందుకు చేప‌ట్టాల్సిన వ్యూహాలు వంటి విష‌యాల్లో ప‌ట్టుకోసం జ‌గ‌న్ మ‌హాభార‌తాన్ని ఔపోస‌న ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. స్తిత‌ప్ర‌జ్ఞ‌త‌ - ఎత్తులు-పైఎత్తులు - సమ‌న్వ‌యం వంటి విష‌యాల్లో మ‌హాభార‌తంలో అద్భుత‌మైన స‌మాచారాన్ని అమ‌ల్లో పెట్టిన‌ట్లు సమాచారం.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే మ‌హాభారతం అందించిన విస్తృత ప‌రిజ్ఞానం కావ‌చ్చు లేదా జ‌గ‌న్ సొంతంగా గ్ర‌హించిన నైపుణ్యంతో కావ‌చ్చు ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి పూర్తిగా మారిపోయింది. గ‌తంలో వీలైన‌పుడు విలేక‌రుల స‌మావేశం పెట్ట‌డం, అసెంబ్లీలో అవకాశం దొరిక‌న‌పుడు ప్ర‌భుత్వాన్ని ఆధారాల‌తో స‌హా ఇర‌కాటంలో ప‌డేయ‌డం వంటివి జ‌గ‌న్ చేసేవారు. అయితే అలాంటి దోర‌ణిని జ‌గ‌న్ ఇపుడు మార్చుకున్నార‌ని అంటున్నారు. స‌మ‌స్య‌ను చాటిచెప్ప‌డం ఎంత ముఖ్య‌మో క్షేత్ర‌స్థాయికి వెళ్లి బాధితుల‌కు భ‌రోసాగా నిల‌వ‌డం అంతే ముఖ్య‌మ‌ని కూడా జ‌గ‌న్ భావించిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇందులో భాగ‌మే ప్రకాశం జిల్లాలోని కిడ్నీ బాధితుల వ‌ద్ద‌కు వెళ్లి ప‌రామ‌ర్శించ‌డం అయినా, అమ‌రావ‌తి రైతుల‌ స‌మ‌స్య‌ల‌ను నేరుగా అక్క‌డికే వెళ్లి తెలుసుకోవ‌డం అయినా అంటూ ప‌లువురు పేర్కొంటున్నారు. అంతే కాకుండా గ‌తంలో జ‌గ‌న్ ఒక ప్ర‌జా స‌మ‌స్య‌పై స్పందిస్తే మ‌రో స‌మ‌స్య‌పై రియాక్ట్ అయ్యేందుకు కొద్ది గ్యాప్ తీసుకునే వార‌ని గుర్తుచేస్తున్నారు. కానీ ఇపుడు అలాంటి దోర‌ణిని ప‌క్క‌న పెట్టిన వైసీపీ అధినేత వ‌రుస బెట్టి బాధితుల వ‌ద్ద‌కు వెళుతున్నారని వివ‌రిస్తున్నారు. రెండ్రోజుల్లోనే ఎలాంటి గ్యాప్ లేకుండా రాజ‌ధాని అమరావ‌తి భూ నిర్వాసితులు, ప్ర‌కాశం జిల్లాలోని కిడ్నీ-ఫ్లోరోసిస్ బాధితుల‌ను క‌ల‌వ‌డ‌మే ఇందుకు తార్కాణ‌మ‌ని గుర్తుచేస్తున్నారు.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నేతగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే రాజ‌కీయ నాయ‌కుడిగా రాష్ట్రానికి సంబంధించిన కీల‌క అంశాల‌పై గ‌ళం విప్ప‌డంలో - చైత‌న్యం క‌లిగించ‌డంలో వెన‌క్కు త‌గ్గ‌డం లేద‌ని గుర్తుచేస్తున్నారు. ఏపీకి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేష్ట‌లు ఉడిగిపోయిన‌ట్లుగా మారింద‌నే అభిప్రాయాన్ని ప్ర‌జ‌లకు తెలియ‌జేయ‌డంలో జ‌గ‌న్ స‌ఫ‌లీకృతులు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా స‌భ‌లు ఏర్పాటుచేయ‌డం, విద్యార్థులు మొదలు కొని విద్యావంతుల‌తో స‌మావేశం అవ‌డం, ఎన్నారైల‌తో కూడా ఈ విష‌యాల‌పై చ‌ర్చించ‌డం వంటి రూపంలో ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ముందుకు సాగ‌డం వ‌ల్ల ఇలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్తున్నారు. మొత్తంగా కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన త‌ర్వాత ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌ర్కారు ప‌రిపాల‌న‌లో కుదురుకునేందుకు కొంత స‌మయం ఇచ్చిన జ‌గ‌న్ అనంత‌రం ఏపీ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను వివిధ రూపాల్లో ప్ర‌జ‌ల‌కు చేరవేయ‌డంలో స‌ఫ‌లం అవుతున్నార‌నేది టాక్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/