Begin typing your search above and press return to search.

ఆ ప‌ని చేయాలే కానీ జ‌గ‌న్ చ‌రిత్ర‌లో మిగిలిపోతారు!

By:  Tupaki Desk   |   26 May 2019 12:02 PM GMT
ఆ ప‌ని చేయాలే కానీ జ‌గ‌న్ చ‌రిత్ర‌లో మిగిలిపోతారు!
X
ఎన్నిక‌ల సంద‌ర్భంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇవ్వ‌టం. ఇచ్చిన హామీల్లో ముఖ్య‌మైన వాటిని అధికారం చేప‌ట్ట‌క‌ముందే కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. విష‌యం ప‌ట్ల అవ‌గాహ‌నతో పాటు.. హామీల అమ‌లులో చిత్త‌శుద్ధి ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఇది సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఏపీ భ‌వ‌న్ లో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

త‌న పార్టీ మేనిఫేస్టోలో పేర్కొన్న‌ట్లుగా ద‌శ‌ల వారీ మ‌ద్య‌పాన నిషేధానికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అందులో భిన్న‌మైన అంశాల్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. రెండింటి విష‌యంలోనూ ఒకేలాంటి క‌మిట్ మెంట్ ను ఆయ‌న ప్ర‌ద‌ర్శించారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్న ఆయ‌న దాన్ని స‌రి చేస్తామ‌ని చెబుతూనే.. ఎన్నిక‌ల హామీలో భాగంగా ఇచ్చిన ద‌శ‌ల వారీ మ‌ద్య‌పాన నిషేధాన్ని 2024 నాటికి పూర్తి చేస్తామ‌న్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

ఇవాల్టి రోజున రాష్ట్ర ప్ర‌భుత్వాలు బ‌తికేస్తున్నాయంటే వాటికి రెండు ర‌కాల ఆదాయాల మీద‌నే నిలుస్తోంది. అందులో ఒక‌టి పెట్రోల్.. డీజిల్ మీద వ‌చ్చే ఆదాయం.. రెండోది మద్యం మీద విధించే ప‌న్ను మీద వ‌చ్చే ఆదాయం. ఇత‌ర ప‌న్నులు ఎన్ని ఉన్నా.. ఈ రెండింటి మీద వ‌చ్చే ఆదాయం భారీగా ఉంటుంది. ఆర్థిక ప‌రిస్థితి బాగోన‌ప్పుడు.. బంగారు బాతుగుడ్డు లాంటి మ‌ద్యం మీద వ‌చ్చే ఆదాయాన్ని పాల‌కులు మిస్ చేసుకుంటారా? అంటే లేద‌ని చెప్పాలి.

కానీ.. జ‌గ‌న్ మాత్రం అందుకు భిన్నంగా తాను ఆ ప‌ని చేస్తాన‌ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌ని చెప్పిన‌ప్పుడు.. ఎన్నిక‌ల సంద‌ర్భంగా తానిచ్చిన ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌పాన నిషేధం మీద త‌న హామీని స‌డ‌లించుకుంటార‌న్న అభిప్రాయం క‌లుగుతుంది. కానీ.. అందుకు భిన్నంగా 2024 ఎన్నిక‌లకు వెళ్లేట‌ప్పుడు మ‌ద్య‌పానాన్ని ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కు ప‌రిమితం చేస్తాన‌న్న స్వీయ డెడ్ లైన్ పెట్టుకున్న తీరు చూస్తే.. జ‌గ‌న్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా ద‌శ‌ల వారీ మ‌ద్య‌పాదాన్ని రాష్ట్రంలో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేసి.. ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కు ప‌రిమితం చేసి ఎన్నిక‌ల్లో ఓట్లు అడిగితే మాత్రం జ‌గ‌న్.. చ‌రిత్ర‌లో శాశ్వితంగా నిలిచిపోతార‌న‌టంలో సందేహం లేదు.