కేసీఆర్ బాటలోనే జగన్.. జనాకర్షక హామీ!

Fri Aug 11 2017 09:54:32 GMT+0530 (IST)

జనాకర్షక హామీలు గుప్పించడంలో సాధారణంగా ప్రతి నాయకుడికీ.. దాదాపుగా ప్రతి హామీకి ఎవరో ఒకరు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ రకంగా చూసినట్లయితే.. తాజాగా నంద్యాల ఎన్నికల ప్రచార సభలో... యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక హామీని ప్రజలకు ఇవ్వడంలో విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటను అనుసరిస్తున్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లా పాలన యంత్రాంగం మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా మరింత అందుబాటులో ఉండడం లక్ష్యంగా రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం నంద్యాల ఎన్నికల సభలో జగన్ కూడా అదే హామీ ఇస్తున్నారు. నంద్యాలను కూడా ఒక జిల్లాగా చేస్తానంటూ జగన్ ప్రజలకు మాట ఇచ్చేశారు.

జిల్లాల పెంపు అనేది.. అధికార వికేంద్రీకరణ.. పాలన యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం అనే కోణంలోంచి మంచి నిర్ణయం అవుతుంది. తెలంగాణలో కేసీఆర్ చేసిన ఈ ప్రయోగం.. సత్ఫలితాలను ఇచ్చింది. ఏపీలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ కోణంలో ఎలాంటి ఆలోచన చేయలేదనే చెప్పాలి. ఏదో అధికార్ల సమావేశాల్లో ‘అవసరమైతే జిల్లాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకుంటాం’ అంటూ జనాంతికంగా ఒక మాట అనేయడమే తప్ప.. చంద్రబాబునాయుడు ఎన్నడూ.. ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించలేదు. కాకపోతే.. నంద్యాల ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన రెడ్డి మాత్రం స్పష్టమైన హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాలు పెంచుతాం అని చెప్పడం మాత్రమే కాదు. తాను అధికారంలోకి వస్తే.. నంద్యాలను కూడా జిల్లాగా చేస్తానంటూ జగన్ చెబుతున్నారు. తమ పట్టణం ఏకంగా జిల్లా కేంద్రంగా అవుతుందనే అంశం.. కచ్చితంగా ప్రజల్ని ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.

అయితే విభజన అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మొన్న మొన్నటిదాకా అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం మీద చాలా ఫోకస్ పెట్టింది. సీట్ల పెంపు అనే వ్యవహారం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం అంటూ లేదు. కేంద్రంలో విపరీతంగా లాబీయింగ్ చేశారు. సీట్లు పెరిగితే.. ఆ ఆశ చూపించి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి మరింత మందిని ఆకర్షించేయాలని భావించిన తెలుగుదేశం పాచికలు పారలేదు. 2022 దాకా సీట్లు పెరిగే అవకాశం లేదంటూ కేంద్రం దాదాపుగా క్లారిటీ ఇచ్చేసింది. తమకు నేరుగా సమాచారం లేకపోయినా చంద్రబాబుకు ఆ సంగతి అర్థమైంది. కాకపోతే.. సీట్ల పెంపు మీద పెట్టినంత శ్రద్ధను ఆయన ఎన్నడూ జిల్లాల సంఖ్య పెంపు లేదా పాలన యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం అనే అంశాలపై పెట్టలేదు. సరిగ్గా అదే పాయింటు పై జగన్ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మార్గాన్ని అనుసరిస్తూ జిల్లాల పెంపు అనే ఆకర్షణీయ హామీని ప్రజలకు అందిస్తున్నారు అనిపిస్తోంది.