Begin typing your search above and press return to search.

బాబుపై పంచ్ ల మీద పంచ్ లేస్తున్న జగన్

By:  Tupaki Desk   |   1 Sep 2015 9:44 AM GMT
బాబుపై పంచ్ ల మీద పంచ్ లేస్తున్న జగన్
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై భారీగానే చురకలు వేశారు. సామాన్య జనాలకు కనెక్ట్ అయ్యేలా మాట్లాడే నేర్పున్న జగన్.. మంగళవారం తన ప్రసంగంలో భాగంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటమే కాదు.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

సోమవారం సభలో.. పుష్కర మృతులకు నివాళి అర్పించే సమయంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మేకప్ వేసుకొని.. షూటింగ్ కోసం వీఐపీ లకు కేటాయించిన ఘాట్ లో కాకుండా సామాన్యులకు కేటాయించిన ఘాట్ లోకి వచ్చి 29 మందిని చంపేసిన చంద్రబాబు అంటూ ఏ రేంజ్ లో విరుచుకుపడ్డారో తెలిసిందే.

మంగళవారం కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై.. ప్రత్యేక హోదా సాధన విషయంలో విఫలం అయ్యారంటూ విరుచుకుపడ్డారు. బాబు మీద జగన్ వేసిన పంచ్ లు చూస్తే..

‘‘ప్రత్యేక హోదా గురించి చెప్పమంటే చరిత్ర చెబుతున్నారు. నోట్ అంటే అర్థముంది. స్టేట్ మెంట్ అంటే అర్థముంది. కానీ ఇప్పుడు చేసే దానికి అర్థం లేకుండా పోతోంది. ఛంద్రబాబు ఏం చెబుతున్నారో.. నోట్ ఎందుకిచ్చారో.. ఒక్క రవ్వ కూడా అర్థం కావట్లేదు. కావాలంటే నోట్ పక్కన పెట్టేద్దాం. చర్చ చేద్దాం’’

‘‘మేం ఈ జనరేషన్. చంద్రబాబు పాత జనరేషన్. ఆయనకు తెలియని చాలా విషయాలు మాకు తెలుసు. మేం హోంవర్క్ చేస్తాం. ఆయన స్టడీ చేయరు. ఆయనకు ఓపిక లేదు’’

‘‘నిజమే.. చంద్రబాబుగారు తన మీదున్న కేసుల గురించి చాలా ఎక్కువ హోంవర్క్ చేస్తారు. ఓటుకు నోట్ల కేసులో ఆయన ఎక్కువగా హోం వర్క్ చేస్తున్నారు’’

‘‘అవిశ్వాస తీర్మానం నోటీసు వెనక్కు తీసుకుపోయి ఉంటే లోక్ పాల్ బిల్లుకు జగన్ వ్యతిరేకమని బండ వేసేవారు’’

‘‘అయ్య.. ఇంగ్లిషు రాకపోతే కాస్త నేర్చుకోండి. కిరణ్ సర్కారును కాపాడేందుకు చంద్రబాబు విప్ జారీ చేయటం సిగ్గుచేటు’’

‘‘ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ జమ్ముకాశ్మీర్ కు రూ.70వేల ప్యాకేజీ ప్రకటించారు. కోటిన్నర జనాభా ఉన్న కాశ్మీర్ కు అంత భారీ ప్యాకేజీ ఇస్తే.. ఐదు కోట్ల మంది ఉన్న ఏపీకి ఎంతివ్వాలి?’’

‘‘చంద్రబాబు మైకు పట్టుకుంటే చాలు.. ప్రత్యేకహోదా తెస్తామనే వారు. 15 నెలలు గడుస్తున్నా.. ప్రత్యేకహోదా మాత్రం రాలేదు’’

‘‘ఔట్ డేటెడ్ అయి.. అవగాహన లేని చంద్రబాబు చెప్పే విషయాలను వినాల్సిన ఖర్మ ఈ సభకు పట్టింది. సెల్ ఫోన్లు నేను తెచ్చానని చంద్రబాబు చెబితే వినాల్సిన ఖర్మ మాకేంటి?’’

‘’20 ఏళ్ల క్రితం ఇదే రోజు చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎంగా ప్రమాణస్వీకరం చేశారు. ఎవరు చెప్పిన రెండు రెళ్లు నాలుగే అవుతుంది. ఎవరు చెప్పినా వాస్తవాలు.. వాస్తవాలే’’

‘‘మిమ్మల్ని బోనులో పులిలా పెట్టి కొట్టే కార్యక్రమం ఏదో జరుగుతున్నట్లుంది. దాన్నుంచి బయటపడి రాష్ట్రం కోసం పోరాడండి’’