Begin typing your search above and press return to search.

జగన్ పాదయాత్ర అడుగు..పంచెకట్టుతోనే పడాలి!

By:  Tupaki Desk   |   12 Jan 2017 5:52 PM GMT
జగన్ పాదయాత్ర అడుగు..పంచెకట్టుతోనే పడాలి!
X
ఆయనది పంచెకట్టు.. పల్లెబాట. రైతన్నలా పంచె కట్టారు - తలపాగా చుట్టారు! అలనాటి అమెరికా అధ్యక్షుడు బుష్ కూడా వైఎస్ లో ఒక రాజును అదే సమయంలో.. ఒక రైతును చూశారు! ‘మీరచ్చం రైతులాగే ఉన్నారే..’ అని సంభ్రమంగా అన్నారు బుష్! పంచె కట్టు అంటే వైఎస్.. వైఎస్ అంటే పంచెకట్టు. అచ్చ తెలుగు పంచెకట్టుకే అందాన్ని తీసుకొచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిది. ఢిల్లీ వెళ్లినా.. అంతర్జాతీయ మీడియా ముందుకు వెళ్లినా.. వైఎస్ ‘కట్టు’బాటు మార్చలేదు. మట్టికి దగ్గరగా ఉండిన మట్టి మనిషి కదా!

పంచె కట్టు.. భారతదేశ రాజకీయాన్నే శాసించిన నేపథ్యం ఉంది దీనికి. దాని పవర్ అలాంటిది మరి! వైఎస్ కు ముందు చాలా మంది పంచెలు కట్టారు - పంచెకట్టును అధికారానికి దర్పణంగా మార్చారు. కానీ దానికి రాజసాన్ని తీసుకొచ్చిన ఘనత - పంచెకట్టునే రాజసానికి ప్రతీకగా మార్చిన ఘనత మాత్రం నిస్సందేహంగా వైఎస్ ఆర్ కే దక్కుతుంది.

ఏ రోజుకారోజు ప్రకాశిస్తున్న సూర్యుడిలా వెలిగిపోయేవారు వైఎస్. ఆయనలో ఏదో ఉత్తేజం. తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కువ సంవత్సరాల పాటు పంచెకట్టులోనే కనిపించారు వైఎస్. అయితే ఎక్కడా మొనాటినీ లేదు.. పల్లెబాట పట్టినా - ఢిల్లీ వెళ్లినా.. పంచెలోనే వైఎస్ సిగ్నేచర్ ఆవిష్కృతం అయ్యేది.

వైఎస్ గురించి మాట్లాడుకుంటే పంచె కట్టు ప్రస్తావన తప్పనిసరి. మరి ఆయన తనయుడు - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రకాశించి పోవడంలో తక్కువేమీ కాదు! పొలిటికల్ లీడర్ గా గ్లామర్ విషయంలో జగన్ ఇప్పటికే తనదైన సిగ్నేచర్ ను కలిగి ఉన్నాడు. నిలువు చారల చొక్కాలకు డిమాండ్ పెంచేశాడు జగన్. అంతేనా.. ఆ మధ్య బ్రిటన్ టూర్ లో జగన్ టీ షర్ట్ - జీన్స్ లుక్స్ అభిమానులను అలరించడమే కాదు.. ఆంధ్రా అంతా చర్చనీయాంశంగా నిలిచాయి. మోడ్రన్ టైమ్స్ కు తగ్గట్టుగా జగన్ అదరగొట్టేశాడు!

అంతకు మించి ఆకట్టుకున్న లుక్ ఏదంటే.. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనలో కనిపించినది! శ్రీశైలం దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన వేళ జగన్ అచ్చమైన తెలుగు పంచెకట్టు లో కనిపించారు. ఆచార సంప్రదాయాలకు విలువనివ్వడంలో తనకు తానే సాటి అని నిరూపించుకోవడంతో పాటు.. ఆ రూపం ప్రజానీకం గుండెలను హత్తుకుంది…. ఒక్కసారిగా వైఎస్ ను గుర్తు చేసింది!

అదే జిల్లా పర్యటనలో ఒక రైతులను పరామర్శించిన వేళ జగన్ తలపాగా చుట్టి కనిపించడం.. రైతు రూపానికే రాజసాన్ని తీసుకొచ్చింది. రైతులతో మమేకం అవుతూ జగన్ తలపాగా చుట్టాడు. ఆ ఫొటోలు కొన్ని నిమిషాల్లో ఫేస్ బుక్ - వాట్సాప్ లలో ప్రొఫైల్ పిక్స్ గా మారిపోయాయంటే.. రైతు రూపం వైఎస్ కుటుంబానికి ఎంతగా అచ్చొచ్చిందో.. వైఎస్ వారసుడిని అందరూ ఏ రూపంలో చూడాలని కోరుకుంటున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు!

రాజకీయ నేతకు రూపం కూడా చాలా ప్రధానమే. వారి రూపం సామాన్య ప్రజానీకంలో విశ్వాసాన్ని కలిగిస్తుంది. దగ్గరి తనానికి ప్రతిబింబం అవుతుంది. తమ కట్టుబాట్లలో కనిపిస్తున్నాడు.. తమ వాడనిపిస్తున్నాడే.. నమ్మకాన్ని పెంచుతుంది. స్వచ్ఛమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ బంధమే ఎన్నికల్లో ప్రజల మన్ననను పొందేలా చేస్తుంది. కొంత శాతం ఓటు బ్యాంకును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రకంగా చూసినా.. సంప్రదాయబద్ధమైన, స్వచ్ఛమైన రూపంలో కనిపిస్తూ.. జగన్ ప్రజలకు మరింత దగ్గరవుతున్నాడు. పల్లెబాట - ఆలయాల సందర్శనల సమయంలో ఆయన అచ్చమైన తెనుగు రూపంలో కనిపించడం ఆకట్టుకునే అంశంగా మారుతోంది. ఇప్పుడు జగన్ శ్రేయోభిలాషులు కాంక్షిస్తున్నది ఏమిటంటే.. జగన్ ఇలాగే కొనసాగాలని! ప్రజల ఆదరాభిమానాలను చూరగొనడంలో, ప్రజలపై దక్షతలో వైఎస్ ను గుర్తు చేస్తున్న.. కట్టుబాటులో కూడా వైఎస్ ను అనుసరిస్తే బాగుంటుందనేది వైఎస్ అభిమానుల విశ్వాసం. ఫ్యాంటూ షర్టుకు మించిన గ్లామర్ పంచెకట్టులో ఆవిష్కృతం అవుతోంది… ఈ రూపం ప్రజల హృదయాలకు దగ్గర అవుతోంది. కాబట్టి.. జగన్ ఇలా సాగాలని, పంచెకట్టులో తెనుగుతనానికి ప్రతీకగా కొనసాగాలని కోరిక. ప్రజల కష్టనష్టాలను.. ప్రజల స్థితిగతులను తెలుసుకొంటూ జగన్ పాదయాత్రను చేపట్టే అవకాశాలున్నాయి. ఇది వరకూ తండ్రి వైఎస్ బాటన మరో ప్రజా ప్రస్థానానికి అడుగు వేస్తే.. అది పంచెకట్టులోనే పడాలనే ఆకాంక్ష వ్యక్తం అవుతోంది.