Begin typing your search above and press return to search.

అక్టోబ‌ర్ 23న తేల‌నున్న జ‌గ‌న్ భ‌విష్య‌త్‌!

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:47 PM GMT
అక్టోబ‌ర్ 23న తేల‌నున్న జ‌గ‌న్ భ‌విష్య‌త్‌!
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ముంద‌డుగు విష‌యంలో నెల‌కొన్న ఉత్కంఠ ఇంకా కొన‌సాగుతోంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనుండటంతో...అక్రమాస్తుల ఆరోప‌ణ‌ల‌ కేసులో ఆరునెల‌ల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిటిషన్‌ పై తుది తీర్పు విష‌యంలో మ‌రో పొడ‌గింపు వ‌చ్చింది.

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేయ‌గా...సీబీఐ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. కాగా ఈ నెల 23న నిర్ణయం ప్రకటించనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. కోర్టులో వాద‌న‌ల సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది త‌న వాద‌న‌లు వినిపిస్తూ ప్ర‌త్యేక‌మైన కేసుల్లో వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు క‌ల్పించ‌వ‌చ్చ‌ని ఉంద‌ని పేర్కొన్నారు. దీనికి సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌లు వినిపిస్తూ కేవ‌లం విచార‌ణను పొడ‌గించేందుకు మాత్ర‌మే జ‌గ‌న్ మిన‌హాయింపు కోరుతున్నార‌ని తెలిపారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం తీర్పును 23వ తేదీకి వాయిదా వేసింది.

మ‌రోవైపు న‌వంబ‌ర్ 2వ తేదీ నుంచి త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభం కానున్న పాద‌యాత్ర తిరుప‌తి - కోస్తాంధ్ర మీదుగా ఇచ్చాపురం వ‌ర‌కు చేరి అక్క‌డ ముగింపు స‌భ ఉండ‌నుంది. కోర్టు తీర్పున‌కు ఓ వైపు ఎదురుచూస్తూనే మ‌రోవైపు పాద‌యాత్ర‌కు వైఎస్ జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారు. తీర్పు అనుకూలంగా వ‌చ్చినా..వ్య‌తిరేకంగా వ‌చ్చినా యాత్ర కొన‌సాగించేందుకు ఆయ‌న కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. మ‌రోవైపు పార్టీ శ్రేణులు సైతం పాద‌యాత్ర‌కు త‌గిన రీతిలో స‌న్న‌ద్ధ‌మవుతున్నాయి.