Begin typing your search above and press return to search.

జగన్ మరీ అమాయకుడేం కాదు గురూ!

By:  Tupaki Desk   |   18 March 2019 6:36 AM GMT
జగన్ మరీ అమాయకుడేం కాదు గురూ!
X
అవసరం ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం - అవసరం లేప్పుడు వీడటం.. అనే లెక్కతో వ్యవహరించిన నేతలకు ఒకింత ఝలక్కే ఇచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసిన కొంతమంది నేతలకు జగన్ గట్టి ఝలక్కే ఇచ్చారు. వారిని చేర్చుకున్నారు కానీ.. వారు కోరుకున్నట్టుగా ఎక్కడా టికెట్లను ఖరారు చేయలేదు జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం.. ఆ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నేతల్లో పలువురికి టికెట్లు ఏవీ దక్కకపోవడం ఆసక్తిదాయకంగా మారింది.

ఇలాంటి వారిలో సీనియర్ పొలిటీషియన్లు దాడి వీరభద్రరావు - కొణతాల రామకృష్లలతో పాటు.. బుట్టా రేణుక - వరుపుల సుబ్బారావు లాంటి వారు కూడా ఉన్నారు. ఇటీవలే దాడి వీరభద్రరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సందర్భంగా ఆయన… జగన్ తో తనకు అనుకూలమైన సీట్లను కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ సీట్ల విషయంలో జగన్ అప్పుడే కుందబద్ధలు కొట్టారట.

తను వాటి విషయంలో వేరే వాళ్లకు హామీ ఇచ్చేసినట్టుగా చెప్పారట. ‘ఇప్పుడు వారి విజయం కోసం పని చేస్తే.. మీకూ పార్టీ అధికారంలోకి రాగానే వేరే అవకాశాలను ఇస్తా..’ అంటూ జగన్ హామీ ఇచ్చారట. అయితే ఆ విషయం అప్పుడు బయటకు రాలేదు. అభ్యర్థుల జాబితా బయటకు వచ్చాకా అసలు విషయం తేలిపోయింది.

కేవలం దాడి వీరభద్రరావు కే కాదు..కొణతాల రామకృష్ణకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. దాడి - కొణతాల గురించి వేరే వివరించనక్కర్లేదు. వీరిద్దరూ గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పని చేశారు - అయితే పార్టీ గెలిచేస్తోందని.. తమ విజయాలు నల్లేరు మీద నడకే అని వీరు భావించారంటారు. ఆ అతి విశ్వాసంతో పని చేయకపోడంతో వీరు ఓడిపోయారు. అలా పార్టీకీ దెబ్బేశారు.

అంతటితో అయినా ఆగారా.. అంటే అదీ లేదు. తీరా ఎన్నికలు అయ్యాకా జగన్ మీద దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆహ్వానాలు వస్తాయేమో అని చూశారు. బాబు కూడా వీరిని పట్టించుకోలేదు. కొణతాలకు ఆహ్వానం వచ్చినా ఎందుకు అటు వైపు వెళ్లలేదు. చివరకు జగన్ వద్దకే వచ్చినా.. వీరికి టికెట్లు ఏవీ కేటాయించకుండా.. ‘పని చేస్తే - ఎన్నికలయ్యాకా చూద్దాం’ అన్నట్టుగా వ్యవహరించారు జగన్.

ఇక తను భేషరతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినట్టుగా బుట్టా రేణుక ప్రకటించారు. ఆమె షరతులు పెడితే జగన్ చేర్చుకునేదే ఉండకపోవచ్చు. ఇక వరపుల సుబ్బారావు పరిస్థితి ఇదే. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారి విషయంలో జగన్ మొదటి నుంచి ఇదే స్పష్టతతో ఉన్నారని.. కొందరు రిటర్న్ వచ్చేందుకు వర్తమానాలు పంపినా, వస్తే రావొచ్చు..టికెట్లు ఇచ్చేది మాత్రం ఉండదని జగన్ మొదటి నుంచినే చెబుతూ ఉన్నారట! చివరకు అదే జరగడం.. జగన్ పెట్టుకున్న నియమాలకు అద్దం పడుతూ ఉంది.