'తూర్పు' లో అరుదైన చిత్రం!... జగన్ వ్యూహమేంటో?

Thu Mar 14 2019 23:00:00 GMT+0530 (IST)

ఏపీ పాలిటిక్స్ లో *గోపీ*ల గోల ఏమాత్రం ఆగడం లేదు. గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 23 మంది... అధికార పార్టీ టీడీపీ విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ వలకు చిక్కిపోయారు. నియోజకవర్గ అభివృద్ది అంటూ ఓ కొత్త పదాన్ని కనిపెట్టేసి... జనం ఏమనుకుంటారన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండానే గోడ దూకేశారు. గోడ మీద పిల్లులుగా పేరు తేచ్చుకున్నారు. విడతలవారీగా జరిగిన ఈ గోపీల గోల ఇప్పుడు కీలక ఎన్నికల ముందు మరోమారు చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పాలి. నాడు ఏదో ఆశించిన గెలిపించిన పార్టీని వదిలేసిన నేతలు... ఇప్పుడు తాము కొత్తగా చేరిన పార్టీలో రిక్త హస్తాలే మిగలడంతో తిరిగి పాత గూటికే చేరిపోతున్నారు. మరి వీరికి సంబంధించి వారి పాత పార్టీ ఏమంటుంది? ఎలాంటి వ్యూహం అమలు చేస్తుంది? అన్న విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి.రాష్ట్ర రాజకీయాల్లో సెంటిమెంట్ జిల్లాగానే కాకుండా అత్యధిక స్థానాలు కలిగిన జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లా నుంచే మొదలైన ఈ తరహా కొత్త గోలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ కొత్త గోల అసలు విషయంలోకి వెళితే... 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికై టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 23. వారిలో తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా ఉన్నారు. నాడు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వరుపులకు... వచ్చే ఎన్నికల్లోనూ (2019) పత్తిపాడు సీటిస్తానని టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారట. అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న చంద్రబాబు... సుబ్బారావుకు హ్యాండిచ్చేశారు. పత్తిపాడు టికెట్ ను సుబ్బారావుకు కాకుండా ఆయన మనవడు వరుపుల రాజాకు కేటాయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే భగ్గుమన్న సుబ్బారావు... తన అభిమానులు - కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి సూచన మేరకు టీడీపీకి రాజీనామాను అక్కడికక్కడే ప్రకటించేసిన సుబ్బారావు... మరో ఆసక్తికర ప్రకటన చేశారు.

గడచిన ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వడంతో పాటుగా ఎమ్మెల్యేగా గెలిపించిన వైసీపీలోకే చేరతానని కూడా ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఎందుకంటే... నాడు వైసీపీకి హ్యాండిచ్చేసి టీడీపీ గూటికి చేరిన 23 మంది ఎమ్మెల్యేలు - ముగ్గురు ఎంపీల్లో ఒక్కరు కూడా ఇలా యూటర్న్ తీసుకోలేదు. ఈ క్రమంలో ఇలాంటి వారిపై ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దానిపైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలోచించలేదనే చెప్పాలి. ఈ క్రమంలో వరుపుల ప్రకటనపై జగన్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పార్టీని వీడి స్వలాభం కోసం పార్టీని వీడిన సుబ్బారావును పార్టీలోకి ఆహ్వానిస్తారో?  లేదంటే పార్టీకి ద్రోహం చేసిన మిమ్మల్ని పార్టీలోకి చేర్చుకునేది లేదని తేల్చేస్తారో?  చూడాలి. నో ఎంట్రీ బోర్డు కాకుండా సుబ్బారావును పార్టీలోకి ఆహ్వానిస్తే మాత్రం...జంపింగ్ నేతల్లో చాలా మంది మళ్లీ వైసీపీ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ తరహా కొత్త పరిణామంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.