Begin typing your search above and press return to search.

బాబూ..పుస్తకాలు కాదు..పనులు జరగాలి

By:  Tupaki Desk   |   14 Sep 2018 2:18 PM GMT
బాబూ..పుస్తకాలు కాదు..పనులు జరగాలి
X
" అభివృద్ధి అంటే పుస్తకాల్లో చూపించేది కాదు. పేజీలకు పేజీలు ముద్రించి ఎన్నికల అనంతరం ఆ పుస్తకాన్ని అటక ఎక్కించడం కాదు"

" కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు నేను వ్యతిరేకం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలకు ఆద్యుడు"

ఈ మాటలన్నది ఎవరో కాదు.... ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. వినాయక చవితి సందర్భంగా పాదయాత్రకు విరామమిచ్చిన జగన్ మోహన్ రెడ్డి తనను కలిసిన కార్యకర్తలు - నాయకులు - ప్రజలతో మమైకమవుతున్నారు. ఇందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ వైఖరిని - మేనిఫెస్టోలో ఏముండబోతున్నాయో సవివరంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో కులానికో పేజీ కేటాయించారని - ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే చర్య అని జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ది పొందడం తన అభిమతం కాదని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే కేవలం రెండు పేజీలలో పొందుపరిచేదని అన్నారు. ఆ రెండు పేజీలే నవరత్నాలు అని జగన్ చెప్పారు.

వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ. కామ్ అని కొడితే పార్టీ మేనిఫోస్టో అందరి కళ్ల ముందు ప్రత్యక్షమవుతుందని, దానిని ఎవరు పడితే వారు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చామో ముఖ్యం కాదని, వాటిని సక్రమంగా అమలు చేశామా అనేది ముఖ్యమని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే తమకు ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం తనకు చెప్పడం రాదని అన్నారు. ఇందువల్లే గత ఎన్నికల్లో రైతు రుణ మాఫీపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని - దీని వల్ల అధికారంలోకి రామని పార్టీ నాయకులు చెప్పినా తన మాట మీద నిలబడ్డానని గుర్తు చేశారు. ఎన్నికల్లో హమీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం తనకు రాదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయాల్లో భాగంగా మనుషుల్ని విడగొట్టడం - సమాజాన్ని విడదీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని జగన్ స్పష్టం చేశారు. " నేను అలాంటి రాజకీయాలకు దూరం. మానవులంతా కలిసి ఉండాలన్నదే నా లక్ష్యం. నా గమ్యం " అని అన్నారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికతో పాటు ఇతర అంశాలపై పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన జగన్ శనివారం నాడు విశాఖ జిల్లా చిన గదిలి నుంచి తన యాత్రను ప్రారంభిస్తారు.