అయ్యో.. జగన్ కు ఎంత కష్టం..

Fri Mar 15 2019 10:06:51 GMT+0530 (IST)

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హఠ్మాన్మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కీలకమైన ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ.. ఊహించని రీతిలో ఆయనకు గుండెపోటు రావటం.. కన్నుమూయటం జగన్ కు పెద్ద కష్టంగా మారినట్లే. తానెంతో ప్రేమించి.. అభిమానించే బాబాయ్ మరణం జగన్ కు తీవ్ర విషాదాన్ని నింపుతుందనటంలో సందేహం లేదు.ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో సార్వత్రిక ఎన్నికలు ఏపీలో తొలి విడతలోనే జరుగుతున్న వేళ.. ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ కు కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు పోలింగ్ కు మధ్య నెల మాత్రమే ఉండగా.. అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి.

మహా అయితే పాతికరోజులు మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన సమయంలో వైఎస్ వివేకా ఆకస్మిక మరణం జగన్ కు పరీక్షగా మారుతుందని చెప్పక తప్పదు. బాబాయ్ మరణం నేపథ్యంలో కీలకమైన కార్యక్రమాల్ని ఆయన షురూ చేయలేనిపరిస్థితి. వాస్తవానికి ఇప్పటికే తొలిజాబితాను విడుదల చేయాల్సి ఉన్నా.. వాయిదా వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకట్రెండు రోజుల పాటు ఏ కార్యక్రమాన్ని చేపట్టలేని పరిస్థితి.

ఎన్నికల వేళ ప్రతి గంటా అత్యంత విలువైనది. ఇలాంటివేళలో ఊహించని విషాదం మీద పడిన వేళ.. మనసును పిండే విషాదం ఒకవైపు.. ఎన్నికల ఒత్తిడి మరోవైపు. వీటిని బ్యాలెన్స్ చేస్తూ.. శోకసంద్రంలో మునిగిన క్యాడర్ ను ఎన్నికలకు సమాయుత్తం చేసే గురుతర బాధ్యత జగన్ మీద ఉందని చెప్పక తప్పదు. పెను విషాదం ఇంటిని తాకిన వేళ.. సమయాన్ని ఇంటికి కేటాయించాల్సిన పరిస్థితి. ఈ కొత్త సవాల్ ను జగన్ ఎలా ఎదుర్కొంటారన్నది ప్రశ్నే.