Begin typing your search above and press return to search.

అదేంది జగన్ అంత జరిగితే ఒక్క మాట మాట్లాడలేదు

By:  Tupaki Desk   |   3 May 2016 4:42 AM GMT
అదేంది జగన్ అంత జరిగితే ఒక్క మాట మాట్లాడలేదు
X
ఏపీలోని అధికారపక్షం మీద నిప్పులు చెరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోని తన పార్టీ ఎమ్మెల్యేల్ని అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడటం తెలిసిందే. ఓ వైపు కరవు రక్కసి విరుచుకుపడుతుంటే.. ఆ విషయాన్ని పట్టించుకోని చంద్రబాబు సర్కారు.. బజార్లో పశువుల్ని కొన్నట్లుగా తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తుందని.. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు డబ్బు ఇస్తోందని ఆరోపించటం తెలిసిందే.

తాజాగా తెలంగాణలో తమ పార్టీ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి తెలంగాణ అధికారపక్షం టీఆర్ ఎస్ లోకి చేరటం తెలిసిందే. తాజా చేరికతో.. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. తాజా చేరికలో పొంగులేటితో పాటు.. జగన్ కు తెలంగాణలో మిగిలి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోయారు. ఫిరాయింపుల పర్వం కారణంగా తెలంగాణలో పార్టీ అడ్రస్ గల్లంతైన పరిస్థితి. అయినప్పటికీ.. తెలంగాణ ముఖ్యమంత్రి మీద కానీ.. తమ ఎంపీ.. ఎమ్మెల్యేను పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పిన ముఖ్యమంత్రి కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ మీద కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నది లేదు.

ఏపీలో తమ పార్టీ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నారంటూ మండిపడే జగన్.. తెలంగాణలో తమ పార్టీకి ఎదురైన పరిస్థితిపై పెదవి విప్పకపోవటానికి కారణం ఏమిటి? ఏపీలో కానీ తెలంగాణలో కానీ జగన్ కు ఎదురవుతున్నది ఒకేలాంటి పరిస్థితి. అయినా.. ఏపీ విషయంలో అంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్న జగన్.. తెలంగాణలోని తమ పార్టీ పట్ల ఎందుకు స్పందించటం లేదు..?