బాబును పట్టుకున్న జగన్ టెన్షన్

Fri Feb 17 2017 22:15:59 GMT+0530 (IST)

పిల్లనిచ్చినసొంత మామకు వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడని చంద్రబాబు ప్రజల్ని పోట్ల మీద పోట్లు పొడిచేస్తున్న పరిస్థితి. తొమ్మిదిన్నరేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఆ సమయంలో ఆయన వేసిన వేషాలకు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టేశారు. విభజన నేపథ్యంలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా అనుభవానికి పెద్దపీట వేసిన ప్రజలకు ఎంతగా బుద్ధి చెప్పాలో బాబు అంతగా చెప్పినట్లుగా చెప్పాలి. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రాణవాయువు అయిన ప్రత్యేక హోదా విషయంలో మోడీతో కలిసి కోట్లాది మంది ప్రజల్ని దెబ్బేసి చంద్రబాబు.. దాన్ని కవర్ చేసేందుకు చట్టబద్ధత కూడా లేని ప్యాకేజీ పేరు చెప్పా కాలం గడిపేస్తున్నారు.

అంతేనా.. హోదా గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారని అనుకున్నారో ఏమో కానీ.. ప్రత్యేక ప్యాకేజీ ఎంత గొప్పదో తెలుసా అన్నట్లు.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి సన్మానాలు చేస్తూ.. ప్రజల్ని భ్రమల్లో ఉంచేప్రయత్నం చేశారు. ఏ పవన్ కల్యాణ్ ను వెంటేసుకొని హోదా గురించి బాబు మాటలు చెప్పారో.. అదే పవన్ వేర్వేరుగా సభలు పెట్టేసి.. కేంద్రాన్ని కడిగేసినా.. బాబు నుంచి కించిత్ స్పందన రాని పరిస్థితి. మరోవైపు.. ఏపీ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అలుపెరగకుండా ప్రత్యేక హోదా సాధన కోసం ఒకటి తర్వాత ఒకటి చొప్పున కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. తన విష ప్రచారంతో విపక్ష నేతపై విమర్శలు చేస్తున్నారే కానీ.. ప్రజలకు తానిచ్చిన హామీల్ని గుర్తు చేసుకోవటానికి ఇష్టపడటం లేదు.

తనకున్న మీడియా అండతో చెలరేగిపోతున్న చంద్రబాబుకు.. జగన్ దిమ్మ తిరిగే షాకింగ్ విషయాన్ని చెప్పేశారు. ప్రత్యేక హోదాపై తాను చేసే పోరాటం.. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే తప్పించి.. రాజకీయం కోసం కాదన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు పూర్తి అయిన తర్వాత.. ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తారో.. అప్పుడే తమ ఎంపీలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేస్తారని హెచ్చరించారు.

జగన్ నోటి నుంచి వచ్చిన రాజీనామా మాట చంద్రబాబుకు గుండెల్లో పెద్ద బండరాయిగా మారుతుందనటంలో సందేహం లేదు.  హోదా సెంటిమెంట్ ప్రజల్లో పెరగకుండా ఉండేందుకు ప్రత్యేక ప్యాకేజీతో ఏపీకి ఏదో జరిగిపోతుందన్న హైప్ క్రియేట్ చేసిన చంద్రబాబుకు.. జగన్ ఇచ్చిన రాజీనామా వార్నింగ్  కొత్త తలనొప్పిని తీసుకొస్తుందనే చెప్పాలి. రేపొద్దున ఎంపీలు రాజీనామా చేసి.. ఉప ఎన్నికలు జరిగితే.. ప్రత్యేక హోదా మీద తానేం చేశానన్న విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద పడుతుంది. ప్రజల్ని తాను మోసం తీరుకు ఆయన సమాధానం చెప్పలేని వైనాన్ని గుర్తు చేసుకొన్న కొద్దీ బాబుకు జగన్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/