Begin typing your search above and press return to search.

ఆ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ఇప్పుడు జ‌గ‌న్ టీంలో!

By:  Tupaki Desk   |   23 April 2017 4:41 AM GMT
ఆ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ఇప్పుడు జ‌గ‌న్ టీంలో!
X
ప్ర‌శాంత్ కిశోర్ గుర్తున్నాడా? 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌యానికి కృషి చేసిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త. అనంత‌రం 2015లో జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల్లో జేడీయూ నేత నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహా కూటమి బీహార్ ఎన్నిక‌ల్లో విజయం సాధించ‌డం వెనుక ఉన్న వ్యక్తి. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో పంజాబ్‌ లో గెల‌వ‌డం వెన‌క కూడా ప్ర‌శాంత్ వ్యూహం ఉంది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ను వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ క‌లిసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్రి - టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు రానున్నాయని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ...ఒక వేళ ముందస్తు ఎన్నికలొస్తే జనసేన పార్టీ సిద్ధంగా ఉందని పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ సైతం త‌న ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే ప్రశాంత్ కిశోర్‌-జ‌గ‌న్ భేటీ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. త‌ద్వారా ఏపీలో ముంద‌స్తు కోడి కూసిన‌ట్ల‌యింది.

కాగా, బీహార్‌ లోని బక్సార్‌ లో జన్మించిన కిశోర్ ఐక్య‌రాజ్య‌స‌మితి త‌ర‌ఫున‌ ఆఫ్రికాలో ఆరోగ్య నిపుణుడిగా చేస్తున్న ఉద్యోగం వదులుకుని 2011లో భారత్‌ కు వచ్చారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో - తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో సుపరిపాలనకు చిహ్నంగా మోడీని నిలిపేందుకు సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (కాగ్) బృందాన్ని ఏర్పాటు చేశారు. మోడీ కోసం చాయ్ పే చర్చ సహా పలు సృజనాత్మక ప్రచార వ్యూహాలను రూపొందించాడు. ఆయ‌న్ను విజ‌య‌తీరాలకు చేర్చాడు. అయితే మోడీకి అత్యంత స‌న్నిహితుడు అయిన‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత కిశోర్‌ ను ప‌క్క‌న‌పెట్టారు. దీంతో కిశోర్ కూడా దూరంగానే ఉన్నాడు. కిశోర్ స‌త్తాను నితీశ్ గుర్తించి ప్ర‌చారం కోసం స‌హాయం కోరారు. ప్రశాంత్ కిశోర్ ఓకే చేయ‌డం, మ‌హాకూట‌మిని గెలిపించి...మోడీకి ఓట‌మిని రూచి చూపించ‌డం తెల‌సిందే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/