ప్రేమికుల రోజున అమరావతికి కేసీఆర్?

Mon Feb 11 2019 11:36:40 GMT+0530 (IST)

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 14న ప్రేమికుల రోజున ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెబుతున్న కేసీఆర్ ఇప్పుడు ప్రేమికుల రోజున అమరావతికి వస్తున్నప్పటికీ ఆయన రాక చంద్రబాబు కోసం కాదట. చంద్రబాబుకు రాజకీయ విరోధి అయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆహ్వానం మేరకు ఆయన వస్తున్నారు. ఫిబ్రవరి 14న అమరావతిలో జగన్ కొత్తింటి గృహ ప్రవేశం ఉండడంతో ఆ కార్యక్రమానికి రావాలంటూ ఆయన కేసీఆర్ ను ఆహ్వానించారు. అందుకు కేసీఆర్ ఒకే చెప్పారు.
   
కేసీఆర్ తో ఆయన కుమారుడు - టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రానున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ - ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి కూడా కేసీఆర్ తో పాటు వస్తున్నారు. నిజానికి కేసీఆర్ అదే రోజున విశాఖ శారదాపీఠంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మధ్యలో విజయవాడలో జగన్ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై అక్కడ నుంచి విశాఖ వెళ్తారు.
   
ఇప్పటివరకు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉంటున్న జగన్ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో అమరావతిలో ఇల్లు నిర్మించుకున్నారు. పాదయాత్ర కూడా ముగియడంతో పూర్తిగా ఎన్నికల వ్యూహ రచన - రాజకీయ కార్యక్రమాల్లో మునిగి తేలనున్న జగన్ ఈ ఇల్లు కేంద్రంగానే 2019 ఎన్నికలకు వెళ్తున్నారు.