Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సంబోధ‌న‌కు ఐఏఎస్ లు ఫిదా!

By:  Tupaki Desk   |   25 Jun 2019 5:12 AM GMT
జ‌గ‌న్ సంబోధ‌న‌కు ఐఏఎస్ లు ఫిదా!
X
చేతిలో ఉన్న ప‌వ‌ర్ ను బాధ్య‌త‌గా ఫీల‌య్యే వారు త‌క్కువ‌గా ఉంటారు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ ను జ‌ట్టు నాయ‌కుడిగా ఫీల‌య్యే వారుంటే.. జ‌ట్టును కుటుంబంలా భావించి.. అందుకు త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించే తీరు చాలా అరుదుగా క‌నిపిస్తుంది. తాజాగా అలా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రిని క‌లుపుకుపోతున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తాజాగా ఐఏఎస్ ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాలు.. నిర్వ‌హ‌ణ ఎలా ఉండాల‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చేశారు.

క‌ట్ చేస్తే.. నిన్న (సోమ‌వారం) సాయంత్రం రాష్ట్ర ఐఏఎస్ లంతా క‌లిసి బెజ‌వాడ కృష్ణా న‌ది ఒడ్డున ఉన్న బ‌రం పార్కులో ఒక విందు ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆహ్వానించారు. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్య‌క్షుడు క‌మ్ రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలో ఈ విందు ఏర్పాటైంది.

ఈ కార్య‌క్ర‌మానికి అతిధిగా జ‌గ‌న్ వ‌చ్చారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. స‌తీస‌మేతంగా విచ్చేసిన జ‌గ‌న్ కు త‌గ్గ‌ట్లే ఐఏఎస్ అధికారులంతా కూడా త‌మ కుటుంబాల‌తో తాజా విందుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికి ఊహించ‌ని కొత్త అనుభ‌వాన్ని మిగిల్చారు జ‌గ‌న్‌. తాను కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చాన‌ని.. త‌న‌కు అనుభ‌వం లేద‌ని.. అన్న‌లు మీరంతా క‌లిసి న‌న్ను ముందుకు న‌డిపించాల‌న్న ఆయ‌న మాట‌లు ఐఏఎస్ అధికారుల‌కు కొత్త‌గా అనిపించాయి.

ఎంతో సీనియార్టీ ఉన్న అధికారులు సైతం ఇంత అప్యాయంగా మాట్లాడిన సీఎంను తాము చూడ‌లేద‌న్న మాట చెప్ప‌టం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ సైతం త‌న ప్ర‌సంగంలో అధికారుల్ని అన్న‌లుగా ప్ర‌స్తావిస్తూ ఆయ‌న మాట్లాడారు.

జ‌గ‌న్ మాట‌ల్ని చూస్తే.. నాకు అధికారం కొత్త‌. సుబ్ర‌హ్మ‌ణ్యం అన్న‌.. గౌత‌మ్ అన్న‌.. మ‌న్మోహ‌న్ అన్న‌లు న‌న్ను ముందుండి న‌డిపించాలి. నేను తీసుకునే నిర్ణ‌యాల్లో ఏమైనా లోటుపాట్లు క‌నిపిస్తే సుబ్ర‌హ్మ‌ణ్యం అన్న‌.. గౌత‌మ్ అన్న గైడ్ చేస్తారు. అన్న‌లంద‌రూ క‌లిసి ప‌ని చేద్దాం. ప్ర‌జ‌ల‌కు మంచి చేద్దామ‌నుకుంటున్న నాకు మీరంతా స‌హ‌క‌రించాల‌న్న మాట జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ త‌ర‌హా మాట‌లు తాము ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ముఖ్య‌మంత్రి నోటి నుంచి విన‌లేద‌న్న మాట కొంద‌రు ఐఏఎస్ లు మాట్లాడుకున్న‌ట్లు తెలిసింది.