Begin typing your search above and press return to search.

ఆ మీడియాకు జ‌గ‌న్ మార్క్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   27 May 2019 8:19 AM GMT
ఆ మీడియాకు జ‌గ‌న్ మార్క్ వార్నింగ్!
X
అనుకూల మీడియా విష‌యంలో ఏ రాజ‌కీయ నాయ‌కుడికి ఎలాంటి ఇబ్బంది.. అభ్యంత‌రం ఉండ‌దు. త‌మ‌ను వ్య‌తిరేకించే.. విభేదించే మీడియా విష‌యంలోనే స‌మ‌స్య అంతా. అధికారికంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందే.. త‌న‌ను అదే ప‌నిగా వ్య‌తిరేకించే మీడియాను ఉద్దేశించి తాజాగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

ఒక జాతీయ మీడియా సంస్థ‌కు జ‌గ‌న్ ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో కొత్త విష‌యాల్ని వెల్ల‌డించారు. ఫ‌లానా చాన‌ల్.. మీడియా సంస్థ త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తుంటాయ‌ని.. అలాంటి వాటి విష‌యంలో తానేం చేయనున్న విష‌యాన్ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా వాటి పేర్ల‌ను ఓపెన్ గా నే చెప్పేశారు.

పార్టీ అధ్య‌క్ష హోదాలో త‌న‌ను వ్య‌తిరేకించే కొన్ని మీడియా సంస్థ‌ల్ని త‌మ కార్య‌క్ర‌మాల్ని క‌వ‌ర్ చేయొద్ద‌ని చెప్పి.. వారిని త‌మ పార్టీ ఆఫీసుల‌కు రావొద్ద‌ని జ‌గ‌న్‌ చెప్ప‌టం తెలిసిందే. త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. త‌న‌ను వ్య‌తిరేకించే మీడియా విష‌యంలో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెప్పాలి.

ఈనాడు.. ఆంధ్ర‌జ్యోతి.. టీవీ5 మీడియా సంస్థ‌లు త‌మ‌ను వ్య‌తిరేకిస్తుంటాయ‌ని.. వాటి మీద ఎలాంటి క‌క్ష సాధింపు చ‌ర్య‌లు ఉండ‌వ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో అదే ప‌నిగా బుర‌ద జ‌ల్లాల‌ని భావించే వారికి చెక్ పెట్టేందుకు జ్యూడీషియ‌ల్ క‌మిష‌న్ ద్వారా మీడియా త‌ప్పుడు రాత‌ల్ని అరిక‌ట్టాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు.

"దేశంలోనే తొలిసారిగా పరిపాలన కోసం జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఈనాడు - ఆంధ్రజ్యోతి - టీవీ5 లాంటి మీడియా సంస్థలు చంద్రబాబుకు కొమ్ముకాస్తున్నాయి. ఏది ఏమైనా ఇవి చంద్రబాబుతోనే ఉంటాయి. ఈ వ్యవస్థను మార్చబోతున్నాం. సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుచేయబోతున్నాం. మేం ఏం చేయాలనుకున్నా ముందుగా ఆ ప్రతిపాదనను కమిషన్ ముందు ఉంచుతాం. వాళ్లు చెప్పే సూచనలు పాటిస్తాం - పాలసీలో మార్పులు చేస్తాం. అలా జ్యూడీషియల్ కమిషన్ అనుమతితోనే ఏ పాలసీనైనా తీసుకొస్తాం. అలాంటి పాలసీలపై ఈ ఆంధ్రజ్యోతి - ఈనాడు - టీవీ5 లాంటి సంస్థలు ఏవైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే అప్పుడు వాటిపై లీగల్ గా చర్యలు తీసుకుంటాం" అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

అవ‌స‌రం లేకుండా త‌మ‌పై నెగిటివ్ వార్త‌లు రాసినా.. అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేసినా అలాంటి వాటిని ఊరికే వ‌దిలిపెట్ట‌మ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తూ.. ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని.. ఏం చేసినా అధికారికంగా చేయ‌నున్న‌ట్లుగా హెచ్చ‌రించారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌కు సూటి హెచ్చ‌రిక‌లుగా చెప్పాలి. మ‌రి.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో స‌ద‌రు మీడియా సంస్థ‌లు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.