చిరు కోరినట్లే జగన్ తో అపాయింట్ మెంట్ కన్ఫర్మ్

Thu Oct 10 2019 17:15:02 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కోసం మెగాస్టార్ చిరంజీవి అపాయింట్ మెంట్ అడగటం తెలిసిందే. తాజాగా ఏపీ సీఎంవో చిరుకు సమాధానం ఇచ్చింది. జగన్ తో భేటీ కోసం టైంను కన్ఫర్మ్ చేసింది. ఏపీ సీఎంవో వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి ఈ శుక్రవారం ఉదయం 11 గంటలకు కలవనున్నారు.ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ ను చిరంజీవి కలవటం ఇదే తొలిసారి. ఇటీవల తాను నటించిన సైరా చిత్రం విడుదలైన నేపథ్యంలో.. ఆ సినిమాను చూడాలని జగన్ ను కోరనున్నారు.  జగన్ ను కోరినట్లే తన సినిమాను చూడాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైను కోరటం.. అందుకు ఆమె ఓకే చెప్పి.. కుటుంబ సభ్యులతో చూడటం తెలిసిందే.

గడిచిన 20 ఏళ్లలో తాను చూసిన రెండో సినిమా సైరా అని చెప్పటమే కాదు.. చిరంజీవి నటనను ఆమె విపరీతంగా పొగిడేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైరా చూడాల్సిందిగా చిరంజీవి ఎందుకు అడగటం లేదు? అన్నది ప్రశ్నగా మారింది.  తెలంగాణ గవర్నర్ ను.. జగన్ ను సైరా చూడాలని అడుగుతున్న చిరు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినిమా చూడాలని ఎందుకు అడగనట్లు చెప్మా?