Begin typing your search above and press return to search.

బావ‌మ‌రిది భౌతిక‌కాయం ద‌గ్గ‌ర రాజ‌కీయ‌మా బాబు?

By:  Tupaki Desk   |   17 Dec 2018 5:33 AM GMT
బావ‌మ‌రిది భౌతిక‌కాయం ద‌గ్గ‌ర రాజ‌కీయ‌మా బాబు?
X
కుటుంబ స‌భ్యుల‌కు క‌ష్టం వ‌చ్చింది. అలాంట‌ప్పుడు ఎవ‌రైనా ఏం చేస్తారు? చేయ‌గ‌లిగిన సాయం చేస్తారు.. నేనున్నా అంటూ అండ‌గా నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేస్తారు. అంద‌రూ అలా చేస్తార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. చంద్ర‌బాబు లాంటి పెద్ద మ‌నుషులు కొంద‌రు ఉంటారు. ఇలాంటి వారి ఆలోచ‌న‌లు తెలిస్తే అవాక్కు కావ‌ట‌మే కాదు.. ఇలా కూడా చేయొచ్చా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

త‌న బావ మ‌రిది హ‌రికృష్ణ రోడ్డు యాక్సిడెంట్లో మ‌ర‌ణించిన వేళ‌.. ఆయ‌న భౌతిక‌కాయం ప‌క్క‌న పెట్టుకొని.. పరామ‌ర్శ కోసం వ‌చ్చిన కేటీఆర్ తో పొత్తుల లెక్క‌ల గురించి మాట్లాడ‌ట‌మా? ఎప్పుడేం మాట్లాడాలో కూడా బాబుకు తెలీదా? అన్న‌ది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. ఇదే విష‌యాన్ని తాజాగా మ‌రోసారి ఎత్తి చూపిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. బాబు తీరుపై తీవ్ర ఆగ్రాన్ని వ్య‌క్తం చేస్తారు.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌స్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న తాజాగా బాబు దిక్కుమాలిన రాజ‌కీయాల మీద గ‌ళం విప్పారు. తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.తాజాగా ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల్లో కీల‌క‌మైన‌వి చూస్తే..

+ ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఈయన చేసిన జిమ్మిక్కులేమిటో మీరంతా టీవీల్లో చూసే ఉంటారు. ఊసరవెల్లి కన్నా స్పీడుగా రంగులు మార్చాడు ఈ పెద్దమనిషి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు రంగు మార్చినప్పుడల్లా తన రాజకీయ సిద్ధాంతాన్ని కూడా మార్చేస్తుంటాడు. ఇదే పెద్ద మనిషి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తో పొత్తు ఖరారు కాకముందు ఒక మాట - ఆ ఎన్నికల్లో బోర్లా పడ్డాక మరో మాట మాట్లాడుతున్నాడు.

+ కాంగ్రెస్‌ తో పొత్తు ఖరారు కాకముందు టీఆర్ ఎస్‌ తో పొత్తు కోసం నానా ప్రయత్నాలు చేశాడు. టీఆర్ ఎస్‌ తో పొత్తు కుదరకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నాడని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టు 29న హైదరాబాద్‌ లో చంద్రబాబు బావమరిది హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతుండగా - ఆయన భౌతికకాయం పక్కనుండగానే కేటీఆర్‌ తో పొత్తుల కోసం బేరాలాడాడు.

+ కేటీఆర్‌ ససేమిరా అన్నాక రెండు నెలలు తిరగకుండానే ఢిల్లీకి వెళ్లాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌ పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాహూల్‌ గాంధీతో కలిసి ఫొటోలు దిగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. ఎక్కడ చూసినా రాహూల్‌ గాంధీతో కలిసి కనబడ్డాడు.

+ అసెంబ్లీ సాక్షిగా - రాజకీయ వేదికలపైన అధర్మ పోరాట దీక్ష సభలలో చంద్రబాబు అన్న మాటేమిటి? టీఆర్ ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాను..తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ కలిసి ఉండాలని ఎంతో అనుకున్నా.. కానీ నరేంద్ర మోదీ అడ్డుపడ్డాడు.. అని చంద్రబాబు పదేపదే చెబుతూ టీఆర్ ఎస్‌ తో పొత్తుకు ఉర్రూతలూగారు. నిజంగా టీఆర్ ఎస్‌ వాళ్లు ప్రత్యేక హోదాను వ్యతిరేకించి ఉంటే హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ ను ఎలా అడిగావు చంద్రబాబూ? ఈ దిక్కుమాలిన రాజకీయాలను గమనించండి.

+ చంద్రబాబు బీజేపీతో కలిస్తే బీజేపీ మనిషి.. కాంగ్రెస్‌ తో కలిస్తే కాంగ్రెస్‌ మనిషి.ఈ పెద్దమనిషి చంద్రబాబు మురికి కాలువలో దూకి అది గంగానది అని కూడా చెబుతాడు.ఆ స్థాయిలో చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టించాడు. ఆయన ఏం చేస్తే అదే ధర్మం.ఏం మాట్లాడితే అదే న్యాయం. ఈ పెద్దమనిషి ఎవరి మీద కావాలంటే వారి మీద బురద చల్లించగలుగుతాడు. ఆయన ఎల్లో మీడియాతో ఇష్టం వచ్చినట్టుగా అసత్య ప్రచారాలు కూడా చేయిస్తాడు.

+ కాంగ్రెస్‌ పార్టీ 2018 జూన్‌ 8న చంద్రబాబు అవినీతి - అన్యాయాలపై ఒక పుస్తకాన్ని రిలీజ్‌ చేసింది .బాబు లాంటి అవినీతిపరుడు - అన్యాయస్తుడు ఎవరూ లేరంటూ రాహుల్‌ గాంధీ ఫొటో పెట్టి మరీ ఆ పుస్తకాన్ని రిలీజ్‌ చేసింది. ఇది జరిగి నాలుగు నెలలైనా తిరగకముందే అనైతిక పొత్తు పెట్టుకుంది.

+ రాష్ట్రం విడిపోయాక 4లక్షల 43 వేల 854 మంది ఉద్యోగులు ఉన్నారని లెక్క తేల్చారు. 2018 జనవరి నాటికి ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 45 వేల 581 మందికి పడిపోయింది. అంటే 98 వేల 273 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. మరోపక్క రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్రంలో లక్షా 42 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రిటైర్‌ అయిన వారితో కలుపుకుంటే ఆ సంఖ్య రెండున్నర లక్షలు దాటిపోయింది. ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్దమనిషి ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా? 23 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని 7 వేలకు కుదించి మొన్న ఒక నోటిఫికేషన్‌ ఇచ్చాడు.