Begin typing your search above and press return to search.

లెక్క చెప్పి మరీ బాబు గుట్టు రట్టు చేసిన జగన్

By:  Tupaki Desk   |   16 Feb 2017 11:23 AM GMT
లెక్క చెప్పి మరీ బాబు గుట్టు రట్టు చేసిన జగన్
X
ఏపీ వెలుగులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మాటల్లోనేనన్న విషయం మరోసారి రుజువైంది. మొన్నామధ్య విశాఖలో డాబుసరిగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక సదస్సు సందర్భంగా చెప్పిన మాటలన్ని బడాయి మాటలేనని నిరూపించేశారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రికార్డుస్థాయిలో రూ.10 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నామని.. దేశంలోనే ఇదో రికార్డుగా చెప్పటం తెలిసిందే. బాబు నోటి నుంచి ఆ మాటలు వచ్చిన తర్వాత వెంటనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఏపీతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల్లో కేంద్రప్రభుత్వరంగ సంస్థలే సింహభాగమంటూ గాలి తీసే ప్రయత్నం చేశారు.

ఏదైతేనేం.. ఏపీతో అయితే ఒప్పందాలు చేసుకున్నారు కదా అని అనుకున్నా.. అదంతా బడాయే తప్పించి, అందులో నిజం తక్కువన్న విషయాన్ని తేల్చేశారు జగన్మోహన్ రెడ్డి. యువభేరి సందర్భంగా కొన్ని ఉదాహరణలు చెప్పిన ఆయన.. ఏపీ సర్కారు చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాల డొల్లతనాన్ని తేట‌తెల్లం చేస్తూ వివ‌రించారు. ముఖ్యమంత్రి మాటల్లో నిజం నేతిబీరలోని నెయ్యి లాంటిద‌న్నారు. మునుప‌టి స‌ద‌స్సులోనూ ఇలాంటి్ మోస‌మే జ‌రిగింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

పారిశ్రామిక సదస్సు పేరిట చెబుతున్న అబ‌ద్ధాల‌ను జ‌గ‌న్ మాట‌ల్లో వింటే...

‘‘ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు పెట్టారు. 2016 జనవరిలోనూ ఇలాంటి కార్యక్రమం పెట్టారు. అప్పుడు రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని.. ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. ఇన్ని ఎంఓయూలు చేస్తే.. ఇందులో 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతుంటే వ్యవస్థలో మార్పు ఎలా వస్తుంది? సాధారణంగా ఎంఓయూలు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు. దాన్ని ఐఈఎం అంటారు. ఇది రెండో దశ. ఇది చేయకపోతే పీసీబీ క్లియరెన్సులు రావు. బ్యాంకులు రుణాలు ఇవ్వవు’’ అని చెప్పారు.

‘‘రూ.4.67 లక్షల కోట్లకు ఎంఓయూలు చేశామని.. 2.82 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని చంద్రబాబు చెప్పారు. మరి వాస్తవం ఎలా ఉందన్నది చూస్తే.. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2016 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం ఫైల్ అయిన ఐఈఎంలు కేవలం రూ.34,464 కోట్లు మాత్రమే. ఐఈఎంలు ఫైల్ చేసిన ప్రతి ఒక్కరూ పరిశ్రమలు పెడతారని కూడా కాదు. 2015లో అయితే రూ.21,300 కోట్ల ఐఈఎంలు ఫైల్ చేశారు. 2014లో రూ.21,526 కోట్లు ఫైల్ అయ్యాయి. వీటిలో ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయంటే.. 2014లో రూ.2804 కోట్లు మాత్రమే. 2015లో రూ.4542 కోట్లు మాత్రమే. ఈ లెక్కన 2016లో మహా అయితే మరో రూ.7వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వస్తాయి. బాబు చెప్పిన 10 లక్షల కోట్ల లెక్కకు వాస్తవంలో మాత్రం వచ్చేది ఇంతే’’ అని చెప్పారు. చంద్రబాబు ఇంతలా అబద్ధాలు చెబుతుంటే.. మోసాలు చేస్తుంటే ఈ పెద్దమనిషిని చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావట్లేదన్న జగన్.. ఎవరికి పడితే వారికి సూటు.. బూటు వేసి వాళ్లతో ఎంఓయూలు చేసేసుకున్నారని మండిపడ్డారు.

విశాఖలో భారీగా ఒప్పందాలు చేసుకున్నట్లుగా చెప్పిన చంద్రబాబు మాటల్నే చూసి.. ఆయన ఒప్పందాల చేసుకున్న వారి ప్రొఫైల్స్ ను చూసినప్పుడు.. కనిపించే కొన్ని నిజాల్ని జగన్ వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఉదాహరణలు వింటే.. చంద్రబాబు మాటల మాయ ఏమిటో ఇట్టే అర్థమైపోతుందని చెప్పాలి. బాబు కనికట్టు గుట్టురట్టు చేసిన జగన్ మాటల్ని చూస్తే.. ‘‘త్రిలోక్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబుతో ఎంఓయూ సంతకం చేశారు. ఈయన విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినవారు. ఈయన చేసే పని పారిశ్రామిక వేత్త గంధం నందకుమార్ వద్ద నుంచి ప్రెస్‌ నోట్లు తెచ్చి.. విలేకరులకు ఇస్తుంటారు. అంటే.. ఆయన ఆ కంపెనీ పీఆర్వో. ఆయన్ను చంద్రబాబు పారిశ్రామికవేత్తను చేసేశారు. ఇతడికి సొంత వాహనం కూడా లేదు. ఈ మనిషి.. మొన్న చంద్రబాబుతో ఎంఓయూ చేసుకున్నారు. ఇలానే బాబుతో ఒప్పందం చేసుకున్న మరో వ్యక్తి పేరు సుధీర్. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడుకు చెందినవాడు. ఆయనది పాత పెంకుటిల్లు. భార్య అంగన్‌వాడీ టీచర్. ఆయన చేసేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంటు. ఈయనకు కూడా సూటు.. బూటు తగిలించి చంద్రబాబు ఎంఓయూ చేసుకున్నారు’’ అని చెప్పారు.

రాష్ట్రం బాగుండాలని.. పెట్టుబడులు రావాలని అందరూ ఆశిస్తామని.. కానీ ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఎవరితో పడితే వాళ్లతో ఎంఓయూలు చేసేసి రూ.10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పటం దర్మార్గమన్నారు. చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరూ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారన్న జగన్.. తాను చెప్పినా ముందుకు రారని తేల్చేశారు. పరిశ్రమలు పెడితే ప్రత్యేక హోదాతో మాత్రమేనన్న ఆయన.. పారిశ్రామిక రాయితీలు ఇస్తేనే వస్తారన్నారు. ఎందుకంటే.. హోదా వస్తే.. ఇన్‌కం టాక్స్.. ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదని.. రవాణా ఖర్చుల్ని వెనక్కి ఇస్తారన్నారు. అంతేకాదు.. బ్యాంకు రుణాల్లో 3 శాతం వడ్డీ సబ్సిడీ కూడా ఉంటుందని అందుకే ఇలాంటి రాయితీల కోసం పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టేందుకు వస్తారన్నారు. మరి.. జగన్ మీద అంతెత్తు ఆవేశపడే చంద్రబాబు.. ఇప్పుడాయన చెప్పిన ఉదాహరణల మీద వివరణ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/