Begin typing your search above and press return to search.

బాబు ఎమ్మెల్సీ ప్లాన్‌ ను బ‌య‌ట‌పెట్టిన‌ జ‌గ‌న్ !

By:  Tupaki Desk   |   17 March 2017 7:40 AM GMT
బాబు ఎమ్మెల్సీ ప్లాన్‌ ను బ‌య‌ట‌పెట్టిన‌ జ‌గ‌న్ !
X
ఏపీలో స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌పై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌టి క్రితం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప జిల్లా స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యే హోదా నేటి ఉద‌యం జ‌మ్మ‌ల‌మ‌డుగు వెళ్లిన జ‌గ‌న్‌... త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆ త‌ర్వాత పోలింగ్ కేంద్రం బయ‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌ ను మీడియా ప్ర‌తినిధులు చుట్టుముట్టారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తాము ఎందుకు పోటీ చేశామ‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూనే... అధికార పార్టీ టీడీపీ చేస్తున్న అవినీతిమ‌య రాజ‌కీయాల‌ను క‌డిగిపారేశార‌నే చెప్పాలి.

స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి చాలా జిల్లాల్లో స్థానాలున్నా... తాము మాత్రం క‌డ‌ప‌ - క‌ర్నూలు - నెల్లూరు జిల్లాల్లో మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దించామ‌ని ఆయ‌న చెప్పారు. ఎందుకంటే... ఈ మూడు జిల్లాల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులు గెలిచేంత మేర స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు ఓట్లు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. మిగిలిన జిల్లాల్లో త‌మ పార్టీకి గెలిచేంత మేర స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు లేర‌ని, ఆ విష‌యాన్ని తాము అర్థం చేసుకున్న మీద‌టే ఆయా జిల్లాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింప‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో త‌న‌కు బ‌లం లేని చోట కూడా టీడీపీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను అవినీతిమ‌యం చేస్తోంద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

క‌డ‌ప‌ - క‌ర్నూలు - నెల్లూరు జిల్లాల్లో మెజారిటీ స్థానిక సంస్థ‌లు త‌మ పార్టీ కైవసం చేసుకుంద‌న్నారు. అయితే ఇటీవ‌ల అధికార టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌... కార‌ణంగా త‌మ పార్టీకి చెందిన ప‌లువురు స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను టీడీపీ లాగేసుంద‌న్నారు. బెదిరింపులు - తాయిలాలు - కేసుల భ‌యం చూపి టీడీపీ నేత‌లు చేసిన దుర్మార్గ‌పు రాజ‌కీయాల కార‌ణంగానే త‌మ పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ప్ర‌తినిధులు టీడీపీలోకి వెళ్లార‌న్నారు.

అయినా స్థానిక సంస్థ‌లైన జిల్లా ప‌రిష‌త్‌ - మండ‌ల ప‌రిష‌త్‌ - పుర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల బ‌లాబ‌లాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన టీడీపీ ఇప్పుడు చేస్తున్న‌దేమిట‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. తాము మాత్రం వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ముందుకు వెళుతున్నామ‌ని, రేప‌టి ఫ‌లితాల్లో ఇదే విష‌యం తేట‌తెల్లం కానుంద‌ని కూడా జ‌గ‌న్ స్ఫ‌ష్టీక‌రించారు. ఇక బ‌లం లేక‌పోయినా మూడు జిల్లాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టిన టీడీపీ... త‌న అధికార బ‌లాన్ని వినియోగించి వైసీపీ అభ్య‌ర్థుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసే కుటిల నీతికి తెర తీసింద‌ని జ‌గ‌న్ ఆరోపించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/