ఆ నలుగురిపైనే!.. జగన్ యుద్ధం!

Mon Feb 11 2019 22:39:39 GMT+0530 (IST)

ఏపీలో ఎన్నికలక సమయం ఆసన్నమవుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి అంతకంతకూ రాజుకుంటోంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార టీడీపీ - విపక్ష వైసీపీల మధ్యే ఉంటుందని స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయి. మాటకు మాట ఆరోపణకు ఆరోపణ విమర్శకు విమర్శ సెటైర్‌కు సెటైరేనన్న చందంగా ఇరు పార్టీల నేతలు... ప్రత్యేకించి ఇటు నారా చంద్రబాబునాయుడు అటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల నుంచి సంచలన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు మరో రెండు నెలలే గడువు ఉన్న నేపథ్యంలో గడచిన ఎన్నికల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని  కోల్పోయిన జగన్... ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాల్సిందేనన్న కసితో ముందుకు సాగుతున్నారు. 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్... ఇప్పుడు మరోమారు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సమర శంఖారావం పేరిట పార్టీ కార్యకర్తలు తటస్థులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించారు.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై మాట్లాడిన జగన్... ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్థులు ఎవరన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. రాజకీయంగా చంద్రబాబు తమ మొదటి ప్రత్యర్థి అయినా... టీడీపీ అనుకూల మీడియాను కూడా ఆయన ప్రత్యర్థిగానే భావిస్తున్నారు. ఇదే అంశాన్ని అనంతపురం సభావేదిక మీద ప్రస్తావించిన జగన్... ఈ ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు ఈటీవీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5లతో యుద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పారు. చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తుంటే.. వాటిని తిమ్మినిబమ్మిని చేసే ఈ మూడు మీడియా సంస్థలు వంతపాడుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మొత్తంగా మొన్నటిదాకా ఈటీవీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపైనే విరుచుకుపడే జగన్ ఇప్పుడు ఈ జాబితాలోకి టీవీ5ను కూడా చేర్చేశారు. ఓ వైపు చంద్రబాబుతో పోరాటం చేస్తూనే... మరోవైపు టీడీపీ అనుకూల మీడియా మీదా యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని కూడా జగన్ చెప్పుకొచ్చారు.

గడచిన ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో ఓటిమి పాలయ్యామని ఈ దఫా మాత్రం చంద్రబాబుకు ఆ అవకాశం ఇవ్వరాదని ఓటర్లను జగన్ కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే... చంద్రబాబుకు పూనకం వస్తుందని అప్పటిదాకా సంక్షేమ పథకాల మాటే ఎత్తని చంద్రబాబు.. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే సంక్షేమ మంత్రం జపిస్తారని కూడా జగన్ ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల పాటు సంక్షేమం అన్న మాటే ఎత్తని చంద్రబాబు... ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఓటర్లకు ఎర వేసేందుకు సంక్షేమ మంత్రం జపిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తన నోట నుంచి ఏ సంక్షేమ పథకం పేరు వినిపించినా.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దానిని అమలు చేసే దిశగా చంద్రబాబు సాగుతున్నారని ఆరోపించారు. అయినా నాలుగున్నరేళ్ల పాటు చంద్రబాబుకు సంక్షేమం గుర్తుకు రాలేదా? అని కూడా జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.