Begin typing your search above and press return to search.

జ‘గన్’ ఫైర్;బాబు రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేశారంట

By:  Tupaki Desk   |   30 April 2016 7:56 AM GMT
జ‘గన్’ ఫైర్;బాబు రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేశారంట
X
కేంద్ర మంత్రి ఒకరు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. చంద్రబాబు వైఖరిని జగన్ తర్పార పట్టారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి చంద్రబాబు కారణమన్నట్లుగా ఆయన విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయమైన జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన మాటల్లోనే చెబితే..

= ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తుందా? అన్న అంశంపై మనకున్న సందేహాలు.. అనుమానాల్ని పెద్దవి చేస్తూ పార్లముంటలో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. కేంద్రమంత్రి ఒకరు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆయన అలా ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడటానికి కారణం ఏమిటి? అలా మాట్లాడటం ధర్మమేనా? ప్రత్యేక హోదా గురించి అడిగే నాథుడే కనిపించట్లేదు. రాష్ట్ర విభజనప్పుడు ఏం జరిగిందో చూశాం. చంద్రబాబు.. బీజేపీ అంతా కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు.

= విభజన కారణంగా జరిగిన అన్యాయానికి పరిహారంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.కాంగ్రెస్ ఐదేళ్లు అంటే.. బీజేపీ నేత పదేళ్లు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా రాని కారణంగా పరిశ్రమలు.. పెట్టుబడులు రావట్లేదు. ప్రత్యేక హోదా వస్తే.. ఏపీలో పరిశ్రమలు పెట్టటానికి సంబంధించి అనేక రాయితీలు లభిస్తాయి. అదే జరిగితే ఆదాయపన్ను.. ఎక్సైజ్ డ్యూటీ.. సగం రేటుకే విద్యుత్.. రవాణా ఖర్చులో సగం తగ్గుతుంది. ఇవన్నీ ఉంటే.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులే క్యూలో నిలుచుంటారు. పెట్టుబడుల కోసం చంద్రబాబు ఎక్కడెక్కడికో తిరగక్కర్లేదు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు సీమాంధ్రుల జీవితాలతో ఆడుకుంటున్నారు. హోదా విషయమైన కేంద్రాన్ని బలంగా ప్రశ్నించరెందుకు? చంద్రబాబు.. కేంద్రంలో ఉన్న పార్టీలు ఏపీ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి.

= ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరు కారుస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవిని కాదని చంద్రబాబు అంటున్నారు. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? ప్రత్యేక హోదా అవసరం లేదన్న రీతిలో చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా డిమాండ్ ను నీటి పాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా.. రైల్వే జోన్.. పోలవరం ఇతరహామీలు నెరవేర్చకుంటే మంత్రులను ఉపసంహరించరించుకుంటానని చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు. ఆయన రాష్ట్రాన్ని పూర్తిగా అమ్మేశారు. తన మీద ఉన్న ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఎవరినీ నిలదీయటం లేదు. అందుకే.. కేంద్రమంత్రులకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ధైర్యం చేస్తున్నారు.