బాబు అందులో ఆరితేరారన్న జగన్

Mon Mar 20 2017 14:10:32 GMT+0530 (IST)

ఏపీలో విడుదలైన ఎమ్మెల్సీ ఫలితాల్లో మూడూ ఏపీ అధికారపక్షం సొంతం చేసుకోవటం తెలిసిందే. గెలుపే ధ్యేయంగా ఏపీ అధికారపక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్న విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్న వేళ.. ఇదే అంశంపై ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే.. అనైతిక చర్యలకు పాల్పడ్డారన్నారు. కొనుగోలు పథకంలో చంద్రబాబు ఆరితేరిపోయారన్న ఆయన.. డబ్బుతో గెలిచిన గెలుపు ఒక గెలుపేనా? అంటూ మండిపడ్డారు.

గతంలోనూ తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గెలిచే అవకాశం లేకున్నా.. గెలిచేందుకు అడ్డదారి తొక్కి అడ్డంగా బుక్ అయిన ఓటుకు నోటు కేసు ఉదంతాన్ని జగన్ ప్రస్తావించారు. గతంలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలతో అడ్డంగా బుక్ అయి.. కేసుల్లో చిక్కుకున్న వైనాన్ని వివరిస్తూ.. అధికారపార్టీ ప్రలోభాలకు దిగి తమ అభ్యర్థుల్ని అతి కష్టమ్మీదా గెలిపించుకున్నారన్నారు. అధికార పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా.. తాము గట్టి పోటీ ఇచ్చామన్నారు. నైతికంగా చూస్తే.. తాము విజయం సాధించినట్లుగా జగన్ వ్యాఖ్యానించారు. పవర్ లో ఉండి.. సామదాన దండోపాయాల్నిప్రయోగించి.. నేతల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలిచిన గెలుపును జగన్ తూర్పార పట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/