Begin typing your search above and press return to search.

‘హోదా’ జగన్ పంచ్ అదిరింది

By:  Tupaki Desk   |   23 Sep 2016 5:17 AM GMT
‘హోదా’ జగన్ పంచ్ అదిరింది
X
ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవే మాటల్ని చెప్పుకొచ్చారు ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీకి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కాడి వదిలేసిన నేపథ్యంలో.. హోదాపై పోరాటం చేసే వారు ఎవరా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రశ్నించేందుకే పార్టీని పెడతానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండంటే రెండు సభల్ని పెట్టేసిన గమ్మున ఉన్న వేళ.. జగన్ అందుకు భిన్నంగా ప్రత్యేక హోదా మీద తాను వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని తేల్చి చెప్పారు.

ప్రత్యేక హోదా అవసరాన్ని నిన్నటి వరకూ చెప్పిన ఏపీ అధికారపక్షం.. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ నేపథ్యంలో తన టోన్ మార్చుకుంది. హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూనూ.. ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్రమంత్రి వెంకయ్యకు విజయవాడలో ఏపీ సర్కారు సన్మానం చేసిన నేపథ్యంలో.. హోదా విషయంలో ఏపీ సర్కారు కమిట్ మెంట్ ఏమిటన్న విషయం అర్థమయ్యే పరిస్థితి.

ఇదిలా ఉంటే.. హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉందంటూ వెంకయ్య అండ్ కోలు కొన్ని మీడియా సంస్థల్లో భారీగా ప్రచారం చేస్తున్న వేళ.. హోదాపై సీమాంధ్రుల్లో సవాలక్ష సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి. వీటన్నింటికి ఒక్క సమాధానంగా వైఎస్ జగన్ తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు యువతను పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించిన జగన్.. హోదాతో వచ్చే లాభాలతో పాటు.. హోదా విషయంలో ఏపీ సర్కారు ఎంతలా రాజీ పడిందన్న విషయాన్ని వివరంగా వెల్లడించారు.

ఇక.. హోదా విషయంలో సీమాంధ్ర ప్రజలకు జరిగిన మోసం.. దగాపై ఆయన తీవ్ర స్వరంగా మండిపడ్డారు. తన వాదనలో రాజకీయం లేదని.. వాస్తవాలే ఉన్నాయన్న విషయాన్నిచెబుతూ.. కొన్ని వీడియోక్లిప్పింగ్ లను సైతం ప్రదర్శించారు. హోదా ఇష్యూలో ఎన్నికల వేళ బీజేపీ.. టీడీపీ నేతలు చెప్పిన మాటలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతున్నమాటలకు మధ్యనున్న వ్యత్యాసాన్ని అందరికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు జగన్.

ఏలూరు సభలో జగన్ చెప్పిన మాటల్లో కీలకమైన.. ఆసక్తికర అంశాల్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే.. హోదా సాధన కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటాన్ని వివరించటం.. హోదా విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుతో పాటు.. ఏపీలోని బాబు సర్కారు ఏ విధంగా యూటర్న్ తీసుకున్నారు? దాని వల్ల ఏపీకి జరిగే నష్టం ఎంతన్నది ఒక అంశమైతే.. సీమాంద్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదాతో ఏపీకి కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది మరో కీలకాంశం.

అందరికి తెలిసిన మొదటి.. రెండు అంశాన్ని కాస్త పక్కన పెడితే.. కొందరికి మాత్రమే తెలిసిన మూడో అంశానికి వస్తే.. జగన్ చెప్పిన పలు అంశాలు అద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఏదో చెప్పామంటే చెప్పామన్నట్లు కాకుండా.. గణాంకాలతో సహా వివరించి చెప్పిన లెక్కలు అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాయి. జగన్ ప్రసంగాన్ని విన్న తర్వాత అనిపించేది ఒక్కటే.. ఆయన వెల్లడించిన సమాచారం సీమాంధ్రులకు విస్తృతంగా చేరాల్సిన అవసరం ఉంది. తాజాగా జగన్ మాటలు వింటే కేంద్రం ఏపీకి హోదా ఇవ్వని కారణంగా ఎంతగా నష్టపోయిందన్న విషయం అర్థం కావటంతో పాటు.. హోదాతో కలిగే ప్రయోజనాలు విస్తృతంగా తెలియటం ఖాయం.

ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనం ఏమీ ఉండదన్నట్లుగా చంద్రబాబు చెప్పటం కనిపిస్తుంది. అయితే.. హోదా కారణంగా ఏపీకి చేకూరే ప్రయోజనాల్ని జగన్ మాటల్లో చూస్తే.. ‘‘ఉత్తరాఖండ్ లో ప్రత్యేక హోదా కారణంగా ఆ రాష్ట్రానికి 30,224 పరిశ్రమలు వచ్చాయి. రూ.35వేల కోట్ల పెట్టుబడులతో ఒకేసారి 130 శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఉపాధి అవకాశాలు 490శాతం పెరిగాయి. చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ లో యువతకు 2.45 లక్షల ఉద్యోగాలు లభించాయి. హోదాతో హిమాచల్ ప్రదేశ్ లో 10,864 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి.వీటితో రూ.15,324 కోట్ల పెట్టుబడులు రాగా.. 1.29లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఈ వివరాలన్నీ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గతంలో పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోనే ఉంది. ఇవన్నీ చంద్రబాబుకు కనిపించటం లేదా?’’ అని తీవ్రంగా ప్రశ్నించారు.

హోదా ఉంటే భారీగా పారిశ్రామిక రాయితీలు లభిస్తాయని.. దీంతో ఎవరైనా రాష్ట్రానికి పరుగులు పెట్టి మరీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని జగన్ పేర్కొన్నారు. మన రాష్ట్రానికి ఇచ్చినన్ని పారిశ్రామిక రాయితీలు వేరే రాష్ట్రానికి ఇవ్వలేదని బాబు చెబుతున్నారని.. కానీ.. వాటిని చూస్తే.. శనక్కాయలకు.. బెల్లాలకు కూడా సరిపోని పరిస్థితి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని గొప్పగా పొగుడుతున్నారని.. విభజన చట్టంలోఏం చేస్తామని ప్రకటించారో అవన్నీ హక్కుల రూపంలో సంక్రమించాయని.. కానీ.. వాటిని గొప్పగా చెప్పుకోవటంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేవారు. హక్కుగా ఇవ్వాల్సిన వాటికి అదనంగా ఏ మాత్రం ఇచ్చినా అది ప్యాకేజీ అంటే అర్థం ఉంటుందని.. కానీ.. హక్కు ప్రకారంగా ఇచ్చే వాటిని మన రాష్ట్రానికేదో మంచి జరుగుతున్నట్లుగా చెప్పటం ఏమిటని జగన్ నిలదీశారు. విభజన చట్టంలో పోలవరం జాతీయప్రాజెక్టు అని.. కేంద్రమే నిర్మిస్తుందని చెప్పారని.. అలాంటప్పుడు తాజా ప్యాకేజీలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ప్రకటించిందని గొప్పగా చెప్పకోవటం సిగ్గుచేటు వ్యవహారంగా జగన్ అభివర్ణించారు. తాజా ప్యాకేజీలో పేర్కొన్న దాని ప్రకారం చూస్తే.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం అదనంగా ఇస్తున్నది రూ.6వేల కోట్లేనని.. దానికే ఎంతో చేసేసినట్లుగా చంద్రబాబు చంకలు గుద్దుకోవటం ఏమిటని జగన్ మండిపడ్డారు. ఏమైనా యువభేరీలో జగన్ ప్రస్తావించిన అంశాలు ఏపీ సర్కారుకు మింగుడుపడని విధంగా ఉన్నాయనటంలో సందేహం లేదు.