Begin typing your search above and press return to search.

ఓదార్పుయాత్ర‌కు ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని తెలీదు

By:  Tupaki Desk   |   18 July 2018 4:05 AM GMT
ఓదార్పుయాత్ర‌కు ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని తెలీదు
X
సుదీర్ఘ పాద‌యాత్ర‌లో ఒక్కొ అడుగు వేసుకుంటూ వేల కిలోమీట‌ర్లు నడుస్తున్నా.. ఎక్క‌డా అల‌స‌ట‌కు తావు ఇవ్వ‌కుండా.. ముందుగా అనుకున్న రూట్ ప్లాన్‌ కు త‌గ్గ‌ట్లే ముందుకు సాగుతున్నారు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. వాతావ‌ర‌ణం అనుకూలించ‌కున్నా.. ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా.. మొండిగా.. చెప్పిన మాట‌.. ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్లే పాద‌యాత్ర‌ను చేస్తున్నారు.

పాద‌యాత్ర‌లో భాగంగా కాస్తంత విశ్రాంతి తీసుకునే స‌మ‌యంలో ఒక మీడియా ప్ర‌తినిధితో కాసేపు మాట్లాడారు జ‌గ‌న్‌. ఈ సంద‌ర్భంగా ఓపెన్ గా మాట్లాడిన జ‌గ‌న్‌.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను కూడా కొన్ని త‌ప్పులు చేసి ఉండొచ్చ‌న్న మాట‌ను ఒప్పుకున్నారు. నిర్ణ‌యాల ప‌రంగా తాను స‌రైన‌వ‌నిపించిన‌వి..కొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చ‌న్న ఆయ‌న‌.. త‌న కార‌ణంగా త‌ప్పులు జ‌రిగి ఉండొచ్చ‌నే దాన్ని కొట్టి పారేయ‌లేదు.

అదే స‌మ‌యంలో.. త‌న తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌కు న‌చ్చ‌కున్నా కొన్ని ప‌నులు పార్టీ అధినాయ‌క‌త్వం ఆదేశాల మేర‌కు చేయాల్సి వ‌చ్చేద‌న్న జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూలోని అంశాల్ని చూస్తే..

రిపోర్ట‌ర్‌: గ‌త ఎన్నిక‌ల్లో మీ ఓట‌మికి కార‌ణం చంద్రబాబు అబ‌ద్ధ‌పు వాగ్దానాలు అంటుంటారు. అయితే.. ఇదే విష‌యం మీద మీ అభిమానులు చెప్పేదేమంటే.. మీ పార్టీలో చేర‌దామ‌నుకొని వ‌చ్చే వారికి ష‌ర‌తులు పెట్టి దూరంగా పెట్ట‌టం వ‌ల్లే మేజిక్ ఫిగ‌ర్‌ కు ద‌గ్గ‌ర్లోకి వ‌చ్చి ఆగారంటారు. దీనికి మీరేమంటారు? మీరు అంగీక‌రిస్తారా? నేను ఆ రోజు అలా చేసి ఉండ‌క‌పోతేన‌ని..?

జ‌గ‌న్‌: ప‌్రాధ‌మికంగా కార‌ణాలు చెప్పినా నా వైపు నుంచి కూడా త‌ప్పులు ఏమైనా జ‌రిగి ఉంటాయా అంటే జ‌రిగి ఉంటాయి. (పొత్తుల‌కు వ‌స్తామ‌ని వామ‌ప‌క్షాలు ముందుకు వ‌చ్చినా ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌టం లాంటివి అంటూ రిపోర్ట‌ర్ మ‌ధ్య‌లో మాట్లాడ‌గా...) త‌ప్పులు జ‌రిగి ఉంటాయా అంటే.. మ‌నిషి అన్న త‌ర్వాత త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఉండ‌వు. నా వ‌ర‌కు నాకు ఎంపిక చేసిన వైనంలో కొద్దో గొప్పో త‌ప్పులు జరిగి ఉండొచ్చు. అవ‌న్నీ కూడా రిపేర్ చేసుకుంటూ.. అడుగులు ముందుకు వేసే కార్య‌క్ర‌మం చేస్తున్నాం.

పొత్తు పెట్టుకోవాలా? పొత్తు పెట్టుకోక‌పోవ‌టం వ‌ల్లే ఓడిపోయామా అంటే.. దాన్ని పూర్తిగా ఏకీభ‌వించ‌ను. ఎందుకంటే అది పాల‌సీ మ్యాట‌ర్‌.

రిపోర్ట‌ర్‌: పొత్తులు పెట్టుకోక‌పోవ‌టం పార్టీ అధ్య‌క్షులుగా మీ నిర్ణ‌యం

జ‌గ‌న్‌: అదో పాల‌సీ నిర్ణ‌యం. మాకు మంచి అనిపిస్తే.. గెల‌వ‌టం కోసం పొత్తు పెట్టుకోవ‌టం కొంద‌రికి మంచి అనిపించొచ్చు.. గెల‌వ‌టం కోసం పొత్తు పెట్టుకోవ‌టం మ‌రికొంద‌రికి మంచి అనిపించ‌క‌పోవచ్చు.. ఎవ‌రెవ‌రైతే విడివిడిగా పార్టీలుగా ఉన్నారో.. వారంతా ఎవ‌రికి వారుగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. ఎవ‌రి బ‌లం ఎంతో తేలుతుంది. ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎంత‌గా ఆద‌రిస్తున్నారో.. ఎవ‌రిని ఎంత‌గా అభిమానిస్తారో తెలిసిపోతుంది.

రిపోర్ట‌ర్‌: వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంత పెద్ద పాద‌యాత్ర చేసి కూడా మ‌హా కూట‌మి పేరుతో మిగిలిన పార్టీల‌తో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు క‌దా? మీరు ఎందుకు అలా చేయ‌లేక‌పోయారు?

జ‌గ‌న్‌: నాన్న‌గారి టైంలో ఏం చేశార‌న్న‌ది.. నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి నిర్ణ‌యం పైనుంచి చెప్పేవారు. నాన్న‌కు ఇష్టం ఉన్నా లేకున్నా పొత్తు పెట్టుకోవాల‌ని అధిష్ఠానం చెబితే చేయాల్సి వ‌చ్చేది. నాన్న‌కు ఇష్టం లేకున్నా టికెట్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే.

రిపోర్ట‌ర్: మీరు ఓదార్పుయాత్ర చేస్తానంటే ప‌ర్మిష‌న్ తీసుకోమ‌న్న‌ట్లు..?

జ‌గ‌న్‌: ఆ.. (న‌వ్వుతూ).. ఓదార్పు యాత్ర చేస్తానంటే ప‌ర్మిష‌న్ తీసుకోమ‌న్న‌ట్లు. ఓదార్పుయాత్ర‌కు ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌న్న విష‌యం నాకు తెలీదు. కాంగ్రెస్ పార్టీలో ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని త‌ర్వాత తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్పుడు కొన్ని ప‌రిమితుల మ‌ధ్య ప‌ని చేయాల్సి ఉంటుంది. మీ నిర్ణ‌యాలంటూ ఉండ‌వు.