బాబుకు బ్యాండేనా?: ఆ ఇష్యూను మోడీకి చెప్పేసిన జగన్

Tue Jun 11 2019 14:05:26 GMT+0530 (IST)

బజార్లో పది రూపాయిలకు దొరికే వస్తువును.. మీకు ఎవరైనా రూ.15 చొప్పున వసూలు చేస్తే.. మీకేమనిపిస్తుంది?  కాలిపోదు?  అందులోకి బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ లభిస్తున్నా.. దాన్ని వదిలేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్న వాడి దగ్గర విద్యుత్ కొనటంలో అర్థం లేదనే చెప్పాలి. అందులోకి ఏపీలాంటి లోటు బడ్జెట్ రాష్ట్రానికి ఈ తరహా భారాలు పెను శాపాలుగా మారతాయి.చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షిస్తామంటూ ఏపీ సీఎం జగన్ చెప్పటం తెలిసిందే. అయితే.. ఇలా చేస్తే.. పెట్టుబడిదారుల్లో భయం కలుగుతుందని.. పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడతారంటూ భయపెట్టే ప్రోగ్రాం షురూ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బ తీసే వారు వ్యాపారం చేయటానికి వస్తే ఎంత?  రాకపోతే ఎంత?  అయినా.. వ్యాపారం అంటే విన్ టు విన్ పరిస్థితి ఉండాలే కానీ.. రాష్ట్రం ఏమైనా ఫర్లేదు నాకొచ్చే లాభాలు సరిపోతాయని అనుకోవటంలో కూడా అర్థం లేనిది.

బాబు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం యూనిట్ కు రూ.6కొనుగోలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో విద్యుత్ ధర యూనిట్ కు రూ.3 నుంచి రూ.3.50 వరకు ఉంది. లక్షలాది యూనిట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు చిన్నవ్యత్యాసంగా కనిపిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ఖజానా మీద పడే భారం భారీగా ఉంటుందని చెప్పక తప్పదు.

ఈ నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సమీక్షించాలని డిసైడ్ అయ్యారు. అయితే.. కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయంలో సమీక్ష వద్దన్నట్లుగా సంకేతాలు పంపటంతో.. ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి జగన్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. బాబు ప్రభుత్వ హయాంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించటం ద్వారా.. భారీ ఖర్చును తగ్గించొచ్చని.. రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.

తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన చెప్పిన మాటలకు మోడీ సైతం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర అధికారులు మోకాలడ్డుతున్న వైనాన్ని పట్టించుకోకుండా గోహెడ్ అంటూ మోడీ పచ్చజెండా ఊపేసినట్లు చెబుతున్నారు. విద్యుత్ ఒప్పందాల్ని పునఃసమీక్షిస్తే.. బాబుకు బ్యాండేనన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. ఒప్పందాల లోతుల్లోకి వెళితే.. మరెన్ని ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయో..?