జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్.. అజెండా అదే!

Thu Jun 13 2019 10:03:19 GMT+0530 (IST)

ఈ నెల పదిహేనున ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సింది. అయితే  అప్పుడు ఆ కార్యక్రమం రద్దు అయ్యింది. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హోదాలో జగన్ హాజరు కావాల్సింది. అయితే అప్పుడు సమయం మించిపోవడంతో జగన్ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.జగన్ తో పాటు కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆ సంగతలా ఉంటే..ఈ నెల పదిహేనున జగన్ మోహన్ రెడ్డి  ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ మీటింగ్ జరగబోతూ ఉంది. ఈ నేఫథ్యంలోనే జగన్ అక్కడకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నెల పదిహేడు నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పదిహేనో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ మీటింగ్ జరగబోతోంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో నెగ్గిన ఇరవై రెండు మంది ఎంపీలు - రాజ్యసభ సభ్యులిద్దరూ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు హాజరు కానున్నారు.

ఆ సందర్భంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారని తెలుస్తోంది. సభలో ఎలా వ్యవహరించాలి - తమ అజెండా అయిన ప్రత్యేకహోదా అంశం మీద కేంద్రం పై ఎలా ఒత్తిడి తీసుకురావాలి.. అనే అంశం గురించి జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలతో చర్చించబోతున్నారని తెలుస్తోంది.